అంతర్జాల సమానత్వం (నెట్ న్యూట్రాలిటీ)పై ఉక్కుపిడికిలి బిగించాలన్న ప్రయత్నాన్ని నెట్ జెన్ల తీవ్రనిరసనతో విరమించికున్న సంఘటన మరచిపోకుముందే ఇప్పుడు కేంద్రం మరోసారి నెట్ పోలీసింగ్ పై పాలసీ తీసుకురావాలని తెగప్రయత్నించి చివరకు తీవ్రనిరసనకు తలదించుకోవాల్సివచ్చింది.
దేశంలో నెట్ జెన్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రావడంతో వాట్స్ అప్ వంటి సామాజిక సందేశ వేదిక ఎంతో ప్రాచుర్యంపొందింది. మొబైల్ ఫోన్లలోనూ ఇతర నెట్ సాధనాల్లోనూ ఉన్న సోషల్ మీడియా యాప్ ల ద్వారా మేసేజ్ లు పంపించుకునేవారు 90 రోజుల పాటు తమ సందేశాలను నిల్వఉంచుకోవాలనీ, కోరినప్పుడు వాటిని విధిగా చూపించాలన్న షరతులతో కూడిన encryption policy ని ప్రవేశపెట్టడంకోసం కేంద్రం ముసాయిదా పత్రాన్ని తయారుచేసింది.
ఈ విధానం ఆచరణలోకి వచ్చే పక్షంలో సామాజిక సందేశాలతో లింక్ ఉన్న వ్యాపారసంస్థలు, టెలికామ్ కంపెనీలు, ఇంటర్నెట్ కంపెనీలు సందేశాల సారాన్ని (డేటాను) 90రోజుల పాటు నిల్వఉంచే వ్యవస్థ ఏర్పాటుచేయాలి. శాంతిభద్రతల విషయంలో అవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని ప్రభుత్వ,పోలీస్ అధికారులకు అందించాల్సిఉంటుంది. అలా చేయలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుండేలా encryption policyని తీసుకురావాలని ప్రభుత్వం యోచించింది. పైకి అంతా సవ్యంగానే ఉన్నట్టు అనిపించినా పొరుల వ్యక్తిగత సమాచారాన్ని (ఆన్ లైన్ మెసేజెస్ ని) ప్రభుత్వం చూసే వీలు ఈ పాలసీ ద్వారా ఏర్పడుతుంది. ఇది పౌరుల స్వేచ్ఛను హరించినట్లే అవుతుంది. ఈ పాలసీ ప్రకారం 90 రోజుల పాటు వాట్సప్ మెసేజ్ లు అలాగే ఉంచి, అధికారులు అడిగినప్పుడు విధిగా చూపించాల్సిఉంటుంది. ఒకవేళ వాటిని మధ్యలో తొలగిస్తే జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఈ విధానం కార్యాచరణలోకి వస్తే సమాచారం అందిపుచ్చుకునే విషయంలో ఉన్న కొద్దిపాటి స్వేచ్ఛ పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుందని న్యాయనిపుణులు అంటున్నమాట. ఇది మరో రకంగా చెప్పాలంటే ఇంటర్నెట్ పోలిసింగ్ వ్యవస్థలాంటిదే.
ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు మితిమీరుతున్న సమయంలోనూ, సైబర్ నేరాలు పెట్రేగిపోతున్న తరుణంలోనూ నెట్ పోలీసింగ్ వ్యవస్థ ఉండాల్సిందే, ఇది తప్పేమీకాదు, అయితే వ్యక్తుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉండకూడదన్నది న్యాయనిపుణుల అభిప్రాయం.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీ ముసాయిదా పత్రాన్ని ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం నెట్ లో ఉంచింది. దీంతో ప్రజల్లోఆగ్రహం పెల్లుబికింది. దీంతో కేంద్రం దిగివచ్చి ఈ పాలసీ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.
మొదట్లో వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేసింది. పాలసీ పత్రంలో మార్పులుచేర్పులు చేసి మరోసారి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని భావించినా, చివరకు పూర్తిగా విరమించుకున్నట్టు ప్రకటించింది. కేంద్ర మంత్రిమండలి సమావేశం అనంతరం కేంద్ర టెలికం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, National Encryption Policyని హడావుడిగా తీసుకురావాలని ప్రభుత్వం అనుకోలేదని, కేవలం అభిప్రాయసేకరణ నిమిత్తమే పబ్లిక్ డొమైన్ లో ఉంచామని సర్దిచెప్పుకోవడం గమనార్హం.
కొద్ది నెలల క్రిందట నెట్ న్యూట్రాలిటీకి విఘాతం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావించింది. అయితే దీనికి నెట్ జెన్ల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన రావడంతో చివరకు ఆ ప్రతిపాదనను విరమించుకుంది. ఇప్పుడు నెట్ పోలిసింగ్ విధానంపై కూడా అదే జరిగింది. చివరకు నెట్ జెన్లదే విజయమని మరోసారి రుజువైంది. ఏదైనా ముసాయిదాను ప్రజలముందు ఉంచేముందే అన్ని కోణాలను ప్రభుత్వం పరిశీలించాలి. లేకపోతే ప్రజలు తుగ్లక్ పాలనను గుర్తుచేసుకోవాల్సివస్తుంది.
– కణ్వస