జనసేనాని ఈ సారి విశాఖను గురి పెట్టారు. గోదావరి జిల్లాల తర్వాత వారాహి విజయాయత్రను విశాఖలో నిర్వహించనున్నారు. ఇంకా తేదని ఖరారు చేయలేదు కానీ.. మరో వారం రోజుల్లో యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యాత్ర సన్నాహాలను పార్టీ నేతలు ప్రారంభించారు. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర జనసేన నేతలకు నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. యాత్ర ఎక్కడ ప్రారంభం కావాలి.. ఏయే నియోజకవర్గాల గుండా సాగాలన్న అంశంపై చర్చించారు.
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగిందని… అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలని దిశానిర్దేశం చేశారు. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలలని సూచించారు. పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల్లోనే ప్రధానంగా వారాహియాత్రను నిర్వహించాలని పవన్ భావిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో యాత్రను నిర్వహించారు. అక్కడ వచ్చిన జన స్పందన పట్ల జనసన నేతలు సంతోషంగా ఉన్నారు. విశాఖలోనూ ఆ స్థాయిలో యాత్ర విజయవంతం అయ్యేలా చేయాలనుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకటే టార్గెట్ పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. వైసీపీని గద్దె దించడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. వైసీపీకి ఈ సారి ఉత్తరాంధ్రలో గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందన్న అంచనాలు వస్తున్న సమయంలో వారాహిని మరింత దూకుడుగా పరుగులు పెట్టించే చాన్స్ ఉంది. పవన్ గత ఎన్నికల్లో.. గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఈ సారి విశాఖను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.