తునిలో కాపు గర్జన విధ్వంసాలమీద మొదటి దశగా 250 మంది మీద పోలీసులు ఎఫ్ ఐ ఆర్ (ఫస్ట్ ఇన్ ఫర్మేషన్ రిపోర్టు) రిజిష్టర్ చేశారు. రైలు పట్టాల మీదా, రోడ్డు మీదా కూర్చుందాం రండి అని పిలుపు ఇచ్చిన ముద్రగడ పద్మనాభం సహా పలువురు ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో వున్నాయి. విధ్వంసం కేసులో ప్రముఖుల్ని ఫిబ్రవరి 8 దాటాక ఎప్పుడైనా పోలీసులుహఅదుపులోకి తీసుకుంటారు.
ఇండియన్ నేవీ విశాఖ పట్టణంలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకూ అంతర్జాతీయ యుద్ధనౌకా విన్యాసాలు (ఐ ఎఫ్ ఆర్ – ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ) నిర్వహిస్తోంది. 54 దేశాల నావికా దళాలు పాల్గొంటున్న ఈ ఈవెంటుకి దేశదేశాల నాయకులు హాజరౌతున్నారు. ఆ సమయంలో అరెస్టుల వల్ల దేశానికి, ఇబ్బంది కరమైన వాతావరణం తలఎత్తకూడదనే విధ్వంసాలపై పోలీసు చర్యలను 8 వతేదీ తరువాతకు వాయిదా వేశామని ఒక ఉన్నతాధికారి చెప్పారు.
విధ్వంసం చేసినవారిలోపలువురు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వారూ, కోనసీమవారు వున్నారని వీడియోల ద్వారా పోలీసులు గుర్తించారు. వీడియోల ఆధారంగా వేర్వేరు జిల్లాలలో ఇప్పటికే పలువురు యువకులను పోలీసులుషఅదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.