ఈ ఏడాది చివర్లోగా ఎన్నికలు వచ్చేస్తాయనే హడావుడి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాలో ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికల లక్ష్యంగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు కొంత హడావుడి చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ ఏడాదే ఎన్నికలు ఉంటాయనీ, డిసెంబర్ లోగా జరిగిపోతాయంటూ పార్టీ కేడర్ ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాయత్తం చేస్తున్నారు. ఇక, అధికార పార్టీల విషయానికొస్తే.. ఆంధ్రాలో టీడీపీ కూడా దాదాపు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిందనే చెప్పుకోవచ్చు. ఏయే ప్రాంతాల నుంచి ఎవర్ని పోటీకి దించాలనీ, సామాజిక సమీకరణాల ప్రకారం పార్టీలోకి కొత్తగా ఎవర్ని ఆహ్వానించాలనే వ్యూహాల్లో టీడీపీ ఉంది. ఇక, తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే వ్యూహంతో ఉన్నాట్టూ కథనాలు వింటూనే ఉన్నాం. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాదే ఎన్నికలు ఉంటాయనే సందడి స్పష్టంగా ఉంది. మరి, కేంద్రంలో భాజపా కూడా ఇదే ఉద్దేశంతో ఉందా.. అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
భాజపా వ్యూహాకర్తలకు ప్రధాని తాజాగా ఓ ఆదేశం ఇచ్చినట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేంటంటే… లోక్ సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలను కలిపి జరిపే అవకాశం ఉన్న రాష్ట్రాలెన్నీ, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశంపై అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారట! వీలైనన్ని రాష్ట్రాల ఎన్నికల్ని కూడా లోక్ సభ ఎన్నికలతో కలిపి నిర్వహించాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో వినిపిస్తున్నదే. కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా అధ్యయనం చేయమన్నారంటే.. మోడీ కూడా ఈ ఏడాదిలో ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తున్నట్టుగా భావించవచ్చు. నిజానికి, గుజరాత్ ఫలితాల అనంతరం ఈ ఏడాదిలో లోక్ సభ ఎన్నికలకు వెళ్లొచ్చా అనే అంశంపై భాజపా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ, అక్కడ భాజపా విజయం సాధించినా, గ్రామీణ ప్రాంతాల్లో మోడీ సర్కారుపై వ్యతిరేకత వ్యక్తమౌతోందన్నది తేలింది. దీంతో ఇప్పుడు కొత్తగా కర్ణాటక ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
కర్ణాటకలో అధికారం కోసం భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను తీసుకొచ్చి కర్ణాటకలో ప్రచారానికి దించి.. హిందుత్వ అంశాన్నే ప్రధానాస్త్రంగా భాజపా ఎక్కుపెట్టబోతోంది. సీఎం సిద్ధరామయ్య వెర్సెస్ భాజపా నేతల మధ్య మాటల యుద్ధాలు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం.
ఒకవేళ కర్ణాటకలో భాజపా గెలిస్తే.. కనీసం ఓ ఆర్నెల్లు ముందుగానైనా లోక్ సభతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎందుకంటే, ఎలాగూ ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అంటూ మోడీ కూడా తరచూ మాట్లాడుతున్నారు. కాబట్టి, ఏప్రిల్ నెలలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భాజపాకి అనుకూలంగా ఉంటే… ఈ ఏడాదిలోనే జమిలి ఎన్నికలకు ఆస్కారం ఉంటుందనే అనిపిస్తోంది