ఆంధ్రప్రదేశ్లో అన్నిపార్టీలూ , పార్టీయేతర సంఘాలూ కూడా తమ తమ పద్దతుల్లో ప్రత్యేకహౌదా నినాదం వినిపిస్తున్నాయి. రకరకాల ఆందోళనలు నిరసనలు సాగుతున్నాయి. కాని బిజెపి రాజకీయంగా మాట్లాడ్డమే గాని కేంద్రంలోని మెడీ ప్రభుత్వం కనీసంగా స్పందించకపోవడం ఆ పార్టీవారికే ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ పరిస్థితుల్లో చెప్పిందే చెప్పి సమర్థించుకోవడం సమస్యగా మారిందని కూడా వారంటున్నారు. మోడీ చంద్రబాబు వైరుధ్యాలు ఎలా వున్నా ఇంత ఉపేక్ష దేనికని నిట్టూరుస్తున్నారు. అయితే మరో కథనం కూడా వుంది. కర్ణాటక ఎన్నికల పోరాటం ముగియగానే ప్రధాని ఎపిపై దృష్టి సారిస్తారని బిజెపి రాష్ట్ర నాయకులొకరు చెప్పారు. హౌదా ప్యాకేజీ వంటివి పక్కనపెట్టి జిల్లాల వారిగా కేంద్ర మంత్రులు జాతీయ నాయకులూ పర్యటిస్తారట. ఎక్కడికక్కడ కొన్ని వరాలు ప్రకటిస్తారట. బిజెపి అద్యక్షుడు అమిత్ షా కడపతో సహా రాయలసీమ జిల్లాలకు వస్తాడని వీరంటున్నారు. మొదట మోడీయే వచ్చి ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రకటన చేస్తారనుకున్నారు గాని ఆయన స్థాయికి తగిన జనసమీకరణ కష్టమనే సంకోచం అడ్డుపడింది. అమిత్ షా అయితే మధ్యే మార్గంగా వుండొచ్చని భావిస్తున్నారు. ఎపి బిజెపి అద్యక్షుడి ఎంపిక కూడా కర్ణాటక తర్వాతే ఎజెండాలోకి వస్తుందంటున్నారు. అక్కడ 45 నియోజకవర్గాల్లో తెలుగువారి ప్రభావం గణనీయంగా వుంటుందని అంచనా. ఇప్పుడుతెలుగుదేశం కాంగ్రెస్ ఎపి నాయకులు బిజెపికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం నష్టం కలిగిస్తున్నదనీ, తమ ఎపి నాయకులను ఇందుకు వ్యతిరేకంగా రంగంలోకి దించి ఉపయోగించుకోవాలని వ్యూహం నడుస్తున్నది. మూడు మాసాలుగా చాలామంది తెలుగు నేతలు అక్కడే వుండిపోయారు కూడా.ఈ పరిస్థితుల్లో అనవసరంగా ఎవరినో రాష్ట్ర అద్యక్షుడిని చేస్తే మరొక వర్గం మెచ్చకపోవచ్చని నష్టం కలగొచ్చని అధిష్టానం భావిస్తున్నది. అందుకే ఎపికి సంబంధించిన వ్యవహారాలన్నీ కర్ణాటక ఎన్నికల ముగిసేవరకూ పక్కన పెడతారని సమాచారం. అప్పటికైనా ఏవో కొన్ని కోర్కెలైనా తీర్చి తమను ఆదుకోవాలని ఎపిబిజెపి నేతలే ఘోషిస్తున్నారు.