వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నుంచీ సీమాంధ్రప్రజలకు ఏదీ కలిసిరావడం లేదు. రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డిలాంటి ఇద్దరు అసమర్ధ ముఖ్యమంత్రుల దెబ్బకు వాళ్ళు భారీగా నష్టపోయారు. ప్రత్యేక హోదా గురించి స్పందించమని అడిగితే…‘హోదాపై ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి’ అని చెప్పి లౌక్యంగా తప్పించుకున్న నేత రోశయ్య. ఇక కిరణ్ కుమార్ రెడ్డి సమర్థత గురించి ఆయనే చాలా సార్లు కామెడీగా చెప్పుకున్నాడు. వీళ్ళిద్దరి దెబ్బకు భయపడిన సీమాంధ్ర ప్రజలు బోలెడంత అనుభవం, సామర్థ్యం ఉన్న చంద్రబాబును గెలిపించారు. మోడీతో బాబుకు సత్సంబంధాలు ఉండి ఉంటే…ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరకకుండా ఉండి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మరీ తీసికట్టుగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు రాగానే చంద్రబాబుతో సహా టిడిపి నాయకులందరూ మోడీని పొగడడానికి పోటీలు పడ్డారు. దేశంలో ఉన్న నాయకులు అందరికంటే సూపర్ ఫాస్ట్‌గా రియాక్టయ్యాడు చంద్రబాబు. మోడీని ఓ రేంజ్లో పొగిడేశాడు. ఇక టిడిపి అనుకూల మీడియా గురించి అయితే చెప్పనవసరం లేదు. మోడీని ఇంద్రుడు, చంద్రుడు, బాహుబలి అంటూ ఆకాశానికెత్తేశారు. అదే టైంలో సాక్షి కూడా మోడీని మగధీరుడిని చేసి పడేసింది. మోడీతో జగన్ అవసరాలు అలాంటివి మరి. ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన మోడీ పొగడ్తలకు అర్హుడే కానీ మనవాళ్ళు మాత్రం మోడీని పొగడడానికి చాలా చాలా ఎక్కువ ఉత్సాహమే చూపించారనడంలో సందేహం లేదు.
ఈ ఉత్సాహమే ఆంధ్రప్రదేశ్ జనాల్లో బోలెడన్ని సందేహాలు రేకెత్తిస్తోంది. నెటిజనుల కామెంట్స్‌లో ఆ భయాలన్నీ కనిపిస్తున్నాయి. మామూలుగానే చంద్రబాబును చాలా చాలా లైట్ తీసుకుంటున్నాడు మోడీ. కనీసం కేర్ చేయడం లేదని టిడిపి అగ్రనేతలే అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో తగిలినట్టుగా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే మోడీకి చంద్రబాబు అవసరం తెలిసొచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మోడీ సాధించిన విజయంతో చంద్రబాబు దారులన్నీ మూసుకుపోయినట్టే. పవన్ కళ్యాణ్‌ని అడ్డం పెట్టుకుని నరేంద్రమోడీని తిట్టిస్తున్నాడు చంద్రబాబు అని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇక పైన మోడీ విషయంలో పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. చంద్రబాబు, జగన్‌లు మోడీకి ఎప్పుడో సరెండర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు ఉత్తర్వులు, ఆ వెంటనే వచ్చిన ఉత్తరప్రదేశ్ విజయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామన్న వాటిని డిమాండ్ చేసే విషయం పక్కన పెట్టినా….కనీసం అడిగే నాయకుడు కూడా ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరనే ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. 2019 వరకూ ఎపికి ఒరిగేది ఏమీ ఉండదని వాళ్ళు చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా అదే విషయాన్ని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం మోడీ దయతల్చాల్సిందే తప్ప మోడీని అడిగే నాయకుడు ఆంధ్రాలో లేడు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ విషయంలో మోడీ స్పందించిన విధానాన్ని పరిశీలిస్తే మాత్రం ఎపి అవసరాలను మోడీ పట్టించుకుంటాడు అనే నమ్మకం అస్సలు కలగడం లేదు. ప్రపంచానికే పాఠాలు చెప్పాను, నన్ను మించిన అనుభవజ్ఙుడు దేశంలోనే లేడు అని చెప్పుకునే చంద్రబాబు తీరు 2019 ఎన్నికల వరకూ ఎలా ఉంటుందో చూడాలి మరి.