నంద్యాలలో తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్బానందరెడ్డి పెద్ద మెజార్టితో విజయం సాధిస్తారని కొన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రంగ ప్రవేశం చేశారు. ఆ సర్వేల ఫలితాలే సత్యమవుతాయని నిర్ధారిస్తూ ఇందుకు పార్టీ యంత్రాంగం పటిష్టంగా వుండటమే కారణమని విశ్లేషించారు. ఆ వూపులోనే కాకినాడ కార్పొరేషన్ కైవశం చేసుకోవాలని పిలుపునిచ్చేశారు కూడా. అసలు నంద్యాల ఎన్నికల ఫలితం 28న వస్తుంటే 29న కాకినాడ పోలింగ్ నిర్ణయించడమే పొరబాటని ఇప్పుడు వైసీపీ తదితర పార్టీలు అంటున్నాయి. అక్కడ విజయం సాధించడమే గాక ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా ఇక్కడా ఆ ప్రభావం వేచడం అదనపు లాభమని టిడిపి భావించి వుండొచ్చు. కాకినాడకు ప్రతిపక్ష నేత జగన్, కూడా వెళుతున్నారు.రెండు రోజులు మకాం వేసి ప్రచారం చేయొచ్చు. అయితే కాకినాడ పోరాటం స్థానికాంశాలనూ రాష్ట్ర వాదనలను బట్టి జరుగుతుందని భావించాల్సిందే. సెజ్‌లు, ఆక్వాపార్కులు కోస్తా క్యారిడార్, రిలయన్స్ ప్రభావం వంటి అనేక అదనపు అంశాలు కూడా అక్కడున్నాయి. ముద్రగడ పద్మనాభం కాపు ఆందోళన కూడా పక్కనే వున్న ఆ నగరంపై పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆయన కూడా టిడిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. అదిగమనంలో పెట్టుకునే టిడిపి వైసిపీ కూడా 15 మంది కాపు అభ్యర్థులను నిలబెట్టాయట. మరో మాట ఏమంటే బిజెపి నంద్యాలలో కనిపించలేదు గాని కాకినాడలో మాత్రం పొత్తు పెట్టుకుంది. మొత్తం 48 కార్పొరేటర్ స్థానాలలోనూ 39చోట్ల తెలుగుదేశం చేస్తుంటే బిజెపి 9 చోట్ల చేస్తున్నది. అయితే ఈ ఒప్పందాన్ని కూడా అధికార పక్షం పాటించడం లేదన్నది బిజెపి వారి ఆరోపణగా వుంది.
ఉభయులూ పరస్పరం రెబల్స్‌ను ప్రోత్సహిస్తున్నట్టు కూడా వివాదం నడుస్తుంటే చివరకు వారిని తొలగించాలని ఆదేశించామంటున్నారు. మరోవైపున జగన్ వస్తే అడ్డుకుంటామని వర్ల రామయ్య తదితర టిడిపి నేతలు ప్రకటించారు. ఇలా మొత్తంపైన కాకినాడ పోరాటం రసవత్తరమే గాక రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ బాగా దెబ్బతిన్న జిల్లాలు పశ్చిమ గోదావరి తర్వాత తూర్పుగోదావరి. మరి ఇప్పుడేమైనా పుంజుకున్నదీ లేనిదీ కూడా తెలుస్తుంది. ఇటు మంత్రులూ అంటు వైసీపీ సినియర్ నాయకులూ కూడా భారీగానే మొహరించి ప్రచారం చేస్తున్నారు.