నంద్యాల ఉప ఎన్నికల పరాజయంతో పాటే సోషల్ మీడియాలోనూ వైసీపీకి ఎదురుదెబ్బ తగులుతున్నదా? ఆ పార్టీ కీలక నేతలంతా టిడిపిలోనో బిజెపిలోనో చేరుతున్నట్టు విడివిడిగా కథనాలు వస్తుంటే సమాధానాలు సంజాయిషీలు ఇచ్చుకోవలసిన స్థితిలో పడిపోయారు. (మిస్)ఫౖర్బ్రాండ్ రోజాకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. తన అనుచిత వ్యాఖ్యల వల్లనే వైసీపీకి నష్టం వాటిల్లినట్టు వచ్చిన కథనాలకు తోడు పార్టీ వీడుతున్నట్టు కూడా వచ్చిన వదంతులను ఖండించే పనిలో పడ్డారు. కడపజిల్లాలో కీలక నేతగా జగన్ కుడిభుజంగా వున్న గట్టు శ్రీకాంత్ రెడ్డి కూడా తనపేరుతో టిడిపి మైండ్‌గేమ్ ఆడుతున్నట్టు ఆరోపించారు. మరో ఎంఎల్ఎ డా.సునీల్ కుమార్ పార్టీ మార్పు కథనాలను ఖండించారు. ఆఖరుకు పార్లమెంటులో వైసీపీ ఘనాపాటీ మేకపాటి రాజమోహనరెడ్డి కూడా కోటంరెడ్డి శ్రీధరరెడ్డి సమక్షంలో తాను పార్టీ మారతానన్నవి కట్టుకథలేనని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి గతంలోనూ ఇలాటివి ప్రచారంలో పెట్టిందని విమర్శించారు. . ప్రస్తుత ఎంఎల్‌ఎలలో 25 మందికి 2019లో విజయావకాశాలు లేవని సలహాదారు ప్రశాంత కిశోర్ చెప్పినట్టు వస్తున్న కథనాలు కూడా ఆందోళన పెంచుతున్నాయి. సీట్లు పెరగడం లేదని తేలిపోయింది గనక గతంలో వలె వారు టిడిపిలోకి వెళ్లే అవకాశం కూడా వుండదు. ఈ తరుణంలోనే హైకోర్టులో జగన్ పిటిషన్ తిరస్కరణకు గురి కావడం, సిబిఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని ఆదేశించడం కూడా ఇరకాటాన్ని పెంచిందంటున్నారు. ఈ కేసులు అంత తేలిగ్గా ముగిసేవి కావని ఇటీవల చాలా సందర్బాల్లో స్పష్టమవుతున్నట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.ఇంకా ఇలాటి అనేక కథనాల మధ్య వైసీపీ ఎంఎల్ఎలతో జగన్ త్వరలోనే సమావేశం కానున్నారని చెబుతున్నారు. మరి తన అనుచరులలో విశ్వాసం ఆత్మవిశ్వాసం పెంచడానికి ఆయన ఏం చేస్తారో ఏ మేరకు సఫలమవుతారో చూడాలి. కాకినాడ కార్పొరేషన్‌లోనూ టిడిపి గెలుపు ఖాయమంటున్నారు గనక అది కూడా నిరుత్సాహం పెంచవచ్చు. ముద్రగడ పద్మనాభం కూడా ఇప్పటికే తన కాపు ఆందోళన వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటిస్తూ చంద్రబాబు నాయుడు గురించి సాఫీగా మాట్లాడారు. గతసారి ఆయనకే ఓటు వేసినట్టు చెప్పడం విశేషం.