జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు మీడియా విపరీతమైన ప్రచారం ఇచ్చింది. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టే దగ్గర్నుంచి మళ్లీ ఇంట్లోకి వెళ్లే వరకూ లైవ్ కవరేజీలతో హడావుడి చేసింది. కానీ పవన్ కల్యాణ్.. మీడియా తనకు ద్రోహం చేస్తుందనుకున్నారు. తన ఇమేజ్‌తో టీఆర్పీ పంట పండించుకుంటున్నారని… ఫీలైపోయి… మీడియాపై యుద్ధం ప్రకటించారు. నేరుగా మీడియా యజమానులతోనే లొల్లి పెట్టుకుని… కవరేజీ ఇస్తే ఎంత..? ఇవ్వకపోతే ఎంత..? అని తీసి పడేశారు. అంతటితో ఆగిపోలేదు.. జనసేనకు మీడియా సపోర్ట్ భారీగా ఉండాలని లెక్కలు వేసుకుని.. కొంత కార్యాచరణ చేపట్టారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌పై ఆయన అమితమైన నమ్మకం పెట్టుకున్నారు.
కమ్యూనిస్టు పార్టీ చేతిలో పూర్తిగా నలిగిపోయిన 99 టీవీని.. జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. ఆ మరుక్షణం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాన్ని ఓన్ చేసుకున్నారు. 99 టీవీకి టీఆర్పీలు ఎలా పెంచాలో.. సోషల్ మీడియాలో సూచనలు చేశారు. జనసైనికులందరూ.. అన్ని టీవీలను బ్యాన్ చేసి… కేవలం 99 టీవీని మాత్రమే చూడాలని ప్రచారం చేశారు. ఇది పవన్ కల్యాణ్‌కు కూడా సంతృప్తిని ఇచ్చినట్లు ఉంది. తన క్రేజ్‌ను ఇతర చానళ్లు వాడుకోవడం ఏమిటని అనుకున్నారేమో కానీ.. కొన్ని కీలక సందర్భాల్లో… ఎలాంటి సమాచారాన్ని అయినా 99 టీవీకి మాత్రమే ఇవ్వడం ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో జనసేన తరపున ఏదైనా తెలుసుకోవాలన్నా… 99టీవీని చూసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక సార్లు పార్టీ మీటింగుల్లో.. 99 టీవీలోగోను మాత్రమే దగ్గర ఉంచి.. మిగతా చానళ్లందరూ దూరంగా వెళ్లి జూమ్ చేసుకోవాలని.. నేరుగా పవన్ కల్యాణ్… ఆదేశించిన దృశ్యాలు కూడా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతగా 99 టీవీని పవన్ కల్యాణ్‌తో పాటు.. జనసైనికులు కూడా ప్రమోట్ చేసినా… ఆ చానల్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది. బార్క్ ప్రకటించే రేటింగ్స్‌లో కింద నుంచి మొదటి స్థానాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే వస్తోంది. పవన్ తీసుకోక ముందు.. తీసుకున్న తర్వాత కూడా పెద్దగా తేడా లేదు.
రేటింగ్స్‌లో 99 టీవీ పరిస్థితిని చూసి.. జనసైనికులు..అన్నీ మాటలే చెబుతున్నారు.. కనీసం వారు కూడా టీవీ చూడటం లేదన్న అనుమానాలు సహజంగానే ప్రారంభమవుతున్నాయి. సోషల్ మీడియాలో టీవీ నైన్, ఏబీఎన్‌లను డిస్ లైక్ చేద్దామని.. ఆ చానళ్లను అసలు బ్లాక్ లిస్ట్‌లో పెడదామన్న జనసైనికుల పోస్టులకు లక్షల్లో షేర్లు వచ్చాయ. కానీ ఎవరూ ఆచరించలేదని.. ఆ చానళ్లకు వస్తున్న రేటింగ్స్‌తో తేలిపోతోంది. మొత్తానికి పవన్ చేతిలో పడటం వల్ల… 99 టీవీ జాతకం ఏ మాత్రం మారలేదని తేలిపోతోందని.. మీడియా వర్గాలు చెబుతున్నాయి.