శశికళ జైలు పర్వం తర్వాత నుంచీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన నాయకుల వ్యవహార శైలి మామూలుగా మారలేదు. ఇక ఉత్తరప్రదేశ్‌లో బిజెపి భారీ విజయం, కామెడీ నటుడో, రాజకీయ నాయకుడో అర్థం కాని రాహుల్ బాబా పుణ్యమాని 2019లో కూడా మోడీకి తిరుగులేదు అన్న విశ్లేషణలో నేపథ్యంలో ఎవరికి వాళ్ళు జాగ్రత్తపడిపోతున్నారు. మొన్నటి వరకూ బిజెపితీ కటీఫ్ అన్న రాగాలు టిడిపి వైపు నుంచి వినిపించేవి. టిడిపి భజన పత్రిక ఆంధ్రజ్యోతి వారు అయితే మోడీకి వ్యతిరేకంగా ఓ రేంజ్లో వార్తలు వండివార్చారు. నోట్ల రద్దు ఇష్యూలో కూడా ఘాటు హెడ్‌లైన్‌తో మోడీని వీకెండ్ కామెంట్లో ఏకేశాడు రాధాకృష్ణ. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. మోడీతో పాటు బిజెపి నేతలందరినీ కూడా ఉతికి ఆరేశాడు. శశికళ జైలు పర్వం, ఉత్తరప్రదేశ్ విజయం తర్వాత నుంచీ మాత్రం రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బిజెపి నాయకురాలు పురంధేశ్వరి ఇప్పుడు టిడిపి నాయకులను టీజ్ చేస్తున్నారు. టిడిపికి కటీఫ్ చెప్పడానికి కూడా భయపడబోం అని హెచ్చరికలు పంపుతున్నారు. టిడిపి వైపు నుంచి సౌండ్ లేదు. పురంధేశ్వరి వార్నింగ్స్కి రెస్పాండ్ అయిన నాయకుడు ఒక్కడు కూడా లేడు. రోజుకు నాలుగు సార్లు ప్రెస్ మీట్స్‌లో కనిపించే నాయకులు కూడా కనీసం స్పందించడానికి భయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లో మోడీ విజయం గురించే ఓ రేంజ్లో భజన మొదలెట్టిన చంద్రబాబుకు…ఆ భజనను పీక్స్‌కి తీసుకెళ్ళడానికి ప్యాకేజీ అంశం భలే కలిసొచ్చింది. ఇక టిడిపి నాయకులతో పాటు, ఆ పార్టీ అనుకూల మీడియా కూడా ఓ రేంజ్లో భజన మొదలెట్టేసింది. ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. ప్రత్యేక హోదా పాపం మొత్తం చంద్రబాబు అకౌంట్లో వేసెయ్యడానికి, మోడీపైన మచ్చపడకుండా చూడడానికి తనవంతు ప్రయత్నం తానూ చేస్తున్నాడు. అసెంబ్లీలో ఈ ఇద్దరు నాయకుల ప్రసంగాలు నిరూపించిన అంశం అదే. ఈ ఇద్దరు నాయకులకంటే కేసులున్నాయి. ఆ కేసుల పుణ్యమాని మోడీ అంటే బోలెడంత భయం, భక్తి కూడా పుట్టుకొచ్చింది. మరి ప్రజల కోసం ప్రాణాలిచ్చేస్తా…ఎవ్వరికీ భయపడను అంటూ ప్రతి సభలోనూ స్పీచ్‌లు దంచే ‘పవర్ స్టార్’కి ఏమైంది. ఆయన మాటల పవర్ ఎక్కడ? ప్యాకేజీకి చట్టబద్ధత పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ చంద్రబాబు అండ్ కో మోసం చేస్తున్న విధానం పవన్‌కి కనిపించడం లేదా? లేకపోతే విభజన పర్వం అయిపోయేవరకూ కలుగులో దాక్కుని..అంతా అయిపోయాక బయటకు వచ్చినట్టుగా ఇప్పుడు కూడా ఆరు నెలల తర్వాత బయటకు వస్తాడు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి…ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ కళ్యాణ్ ఈ కీలక సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ప్యాకేజీ పేరుతో మోడీ, చంద్రబాబులు ఆడుతున్న డ్రామాపై తన స్పందన ఎందుకు తెలియచేయనట్టు? కనీసం ట్విట్టర్లో కూడా ఎందుకు స్పందించడం లేదు? ప్రత్యేక హోదాకు శాశ్వితంగా సమాధికడుతూ ప్యాకేజ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను విభజన టైంలో మోసం చేసినట్టుగా మరోసారి మోసం చేస్తుంటే పవన్ చూస్తూ ఎలా మౌనంగా ఉన్నాడు? ఇంతకంటే ప్రాధాన్యత ఉన్న అంశం వేరే ఏం ఉంటుంది?
గుండెల నిండా ధైర్యం ఉంది…ఉంది, ప్రాణాలను లెక్క చేయను లాంటి డైలాగులు చెప్పడానికి ‘పవర్’ ఫుల్లుగానే ఉంటాయి. కానీ ఆ మాటలపై నిలబడాలంటే మాత్రం సినిమా స్టార్ఢంతో వచ్చే క్రేజ్ సరిపోదు. మాటల్లో కాకుండా చేతల్లో నిజాయితీ చూపించే సామర్థ్యం ఉండాలి. డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వను అంటూనే సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌ని రోడ్డు మీదకు వచ్చేలా చేసినట్టుగానే ఉంది… ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్న పవన్ తీరు కూడా. ఈ మొత్తం విషయాన్ని స్టడీ చేస్తే అర్థం అయ్యేది ఒక్కటే. పవన్‌కి చంద్రబాబు, జగన్‌లకు తేడా ఏమీ లేదు. వీళ్ళందరికీ కూడా బోలెడన్ని బొక్కలున్నాయి. వాటితో వచ్చిన భయాలున్నాయి. నిజాయితీ, ధైర్యం, పోరాటం లాంటి హీరోయిక్ డైలాగులన్నీ షో చేయడం కోసం మాత్రమే. రియల్ సినిమా మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది.