ఓ సారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అందరితో కలిసి మోదీతో ఓ సమావేశంలో పాల్గొంటే.. ఇప్పటికీ పొత్తుల చర్చలను విశ్లేషకులు చేస్తూనే ఉన్నారు. మరోసారి చంద్రబాబుకు మోదీ నుంచి ఆహ్వానం అందింది. ఈ సారి మరో కీలకమైన అంశంపై సలహాలు, సూచనలు తీసుకు రావాలని చంద్రబాబును కోరారు. జీ-20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు లభించింది. ప్రపంచంలో మన దేశం తనదైన ముద్ర వేసేలా.. ఈ కూటమి నేతృత్వం ఉండాలని మోదీ అనుకుంటున్నారు.
అందుకే ఈ సదస్సు నిర్వహణపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చించి.. సలహాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఆహ్వానం పంపడమే కాదు.. స్వయంగా ఫోన్ చేశారు. చంద్రబాబు కూడా అంగీకరించారు. అయితే ప్రధానమంత్రితో సమావేశానికి ఏపీ ప్రతిపక్ష నేతకు పిలుపు అంటే.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరమైన చర్యలు కూడా సాగుతాయి. ఎదుకంటే ఏపీలో రాజకీయాలు డైనమిక్‌గా మారిపోతున్నాయి. పొత్తుల గురించి చర్చలు నడుస్తున్నాయి. అందుకే.. సమావేశం కూడా హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.
2014లో ఎన్డీఏలో టీడీపీ ఉంది. 2018లో బయటకు వచ్చింది. ఆ తర్వాత మోదీని చంద్రబాబు ఒక్క సారిగా మాత్రమే కలిశారు. అది కూడా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో మాత్రమే కలిశారు. తాజాగా మరోసారి ప్రధాని సమావేశానికి చంద్రబాబు హాజరు కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది. గతంలో చంద్రబాబుతో మాట్లాడటానికి మోదీ ఆసక్తి చూపేవారు కాదు.. కరోనా సమయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడారు కానీ.. చంద్రబాబుతో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. కీలకమైన అంశాల్లో చంద్రబాబును సమావేశానికి పిలుపుస్తున్నారు.