వందేళ్లు పైబడిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత గడ్డు కాలం బహుశా ఎప్పుడూ రాలేదేమో. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వరసగా రాష్ట్రాల్లోనూ ఓటమి ఎదురవుతోంది. నిరుడు బీహార్లో మాత్రం నితీష్, లాలు ప్రసాద్ యాదవ్ పుణ్యమా అని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయింది. అంతకు మించి దాదాపుగా గత రెండేళ్లలో కాంగ్రెస్ సాధించిన ఘనకార్యాలు ఏమీలేవు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఉన్న మరో రెండు రాష్ట్రాల్లోనూ విపక్షాలు గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లీ తనయులు సోనియా, రాహుల్ గాంధీలకు మింగుడు పడని విషయమిది.
ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కేరళ, అస్సాంలలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే మరోసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని సర్వే చెప్తోంది. కేరళలో లెఫ్ట్ కూటమి, అస్సాంలో బీజేపీ కూటమి గెలవవచ్చనే వార్త కాంగ్రెస్ వారికి షాకిచ్చేదే.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో సొంత పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ పరిణామం తర్వాత దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 8కి పడిపోయింది. అందులోనూ చాలా వరకు చిన్నా చితకా రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్ లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు కేరళ, అస్సాంలలో కూడా ఓడిపోతే ఆ పార్టీ బలం మరింత పడిపోతుంది. అప్పుడు కర్ణాటక మినహా కేవలం చిన్న, ఈశాన్య రాష్ట్రాలకే ఆ పార్టీ అధికార బలం పరిమితం అవుతుంది.
ఇండియా టీవీ సర్వే ప్రకారం, కేరళలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య 72 నుంచి 49కి పడిపోయే అవకాశం ఉంది. వామపక్ష కూటమి సీట్లు 66 నుంచి 89 పెరగవచ్చు. ఆశ్చర్యకరంగా ఎన్డీయేకు ఒక సీటు రావచ్చని కూడా సర్వే అంచనా వేసింది.
ఇక అస్సాంలో కమలం వికసించే అవకాశం ఉందట. అయితే మెజారిటీకి 7 సీట్లు తగ్గవచ్చు కాంగ్రెస్ సీట్ల సంఖ్య 78 నుంచి 44కు తగ్గవచ్చు. బీజేపీ కూటమి బలం 27 నుంచి 57కు పెరగవచ్చు. ఎ ఐ యు డి ఎఫ్ బలం 18 నుంచి 19కి పెరగవచ్చు. సర్వే చేసేటప్పుడు బీజేపీ కూటమిలో ఏజీపీని చేర్చలేదు. ఏజీపీ తో కలిసి మెజారిటీ సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే, ఊమెన్ చాందీ, తరుణ్ గొగోయ్ ల పాలనకు ప్రజలు చరమగీతం పాడే అవకాశం ఉందనేది సర్వే సారాంశం. పైగా, కేరళలో ప్రతిసారీ ప్రభుత్వం మారడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. పైగా ఈసారి విజయం కోసం వామపక్షాలు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నాయి. అంటే, కాంగ్రెస్ కు కష్ట కాలం కంటిన్యూ కావచ్చన్న మాట.