తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని బూచిగా చూపించి వెళ్తున్నారు. ఆయన నాయకత్వం కింద పని చేయడం ఇష్టం లేక.. దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతూ.. ఎవర్నీ పట్టించుకోకపోతూండటమేనన్న వాదన వినిపిస్తోంది. అందర్నీ కలుపుకుని వెళ్లాలని జాగ్రత్తలు చెప్పి మరీ హైకమాండ్ పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చింది.
పీసీసీ చీఫ్గా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలందర్నీ ఇంటికి వెళ్లి కలిశారు . అన్నీ సర్దుబాటు అయ్యాయనుకునేలోపే మళ్లీ నేతలంతా రేవంత్ నాయకత్వంపై విమర్శలు ప్రారంభించారు. జగ్గారెడ్డి మొదట్లో సానుకూలంగా ఉన్నా… ఇప్పుడు పూర్తి వ్యతిరేకమయ్యారు. తనను అసలు పట్టించుకోకపోవడంతోనే జగ్గారెడ్డి వ్యతిరేకమయ్యారు. ఇతర నేతలనూ పట్టించుకోవడం లేదు. స్ట్రాటజిస్ట్ ఇస్తున్న సర్వేలు.. నివేదికలు.. రేవంత్ రెడ్డి తీసుకొచ్చి చేర్పిస్తున్న చేరికలు అన్నీ.. సీనియర్లకు నచ్చలేదు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంతకూగాడిన పడకపోతూండటం… పార్టీ నేతల్ని చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తూండటంతో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో కాకుండా… రెండు, మూడు రకాల కమిటీలను నియమించాలని చూస్తున్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, టీ పీసీసీ ప్రచార కమిటీ, సమన్వయ కమిటీలను నియమించి.. మొత్తం ఆ కమిటీల మీదుగానే నిర్ణయాలు జరిగేలా చూడాలనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా రేవంత్ రెడ్డి మాత్రం… హైకమాండ్ వద్ద తన పని తీరులో సెంట్ పర్సంట్ మార్కులేయించుకోవడంలో విఫలమయ్యారు.