ఢిల్లీ లిక్కర్ స్కాంలో చాలా రోజులుగా కామ్ గా ఉన్న ఈడీ మళ్లీ కదులుతోంది. తాజాగా కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ఢిల్లీకి పిలిపించి ప్రశ్నిస్తోంది. రెండు రోజుల నుంచి ఆయనను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీలో నగదు ట్రాన్సాక్షన్స్ విషయంలో బుచ్చిబాబు పాత్ర కీలకమని ఈడీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో బుచ్చిబాబును చాలా సార్లు ప్రశ్నించారు. ఆయనను అరెస్ట్ చేశారు. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. మళ్లీ ఏ అంశాలపై ప్రశ్నిస్తున్నారన్నదానిపై స్పష్టత లేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో హఠాత్తుగా సీన్ మారిపోయింది. పలువురు అప్రూవర్లుగా మారేందుకు సిద్ధపడటం దానికి సీబీఐ, ఈడీ అంగీకరించడం.. వారు బెయిల్ పొందడం జరిగిపోయాయి. అయితే సౌత్ లాబీకి చెందిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ లభించింది. ఉత్తరాదికి చెందిన వారు మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కూడా ఇంకా బెయిల్ లభించలేదు.
ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో పరిణామాలు వేగంగా మారడం వెనుక ఏమైనా కొత్త పొలిటికల్ డెవలప్ మెంట్స్ ఉన్నాయా అన్న అనుమానాలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీజేపీ విషయంలో బీఆర్ఎస్ దూకుడుగా ఏమీ లేదు. బీఆర్ఎస్ విస్తరణ గురించి కేసీఆర్ ఆలోచించడం లేదు. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోనూ పర్యటనలు తగ్గించుకున్నారు.