ముగిసిపోయిందనుకున్న డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ తమ వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ ఎట్టకేలకు ఈడీకి ఇచ్చింది. హైకోర్టు పదే పదే ఆగ్రహం వ్యక్తం చేయడం.. చివరికి సీఎస్‌తో పాటు ఎక్సైజ్ శాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసులకు నిర్ణయించడంతో అధికారులు దిగి వచ్చారు. ఈడీకి అధారాలు ఇచ్చారు. ఇక్కడా ఏమైనా జిమ్మిక్కులు చేశారా.. మొత్తం ఆధారాలు ఇచ్చారా అన్నది ఈడీ అధికారులే చెప్పాల్సి ఉంది. ఈడీ అధికారులకు ఇచ్చిన సమాచారంలో..కోర్టుకు సమర్పించని కీలకమైన వాంగ్మూలాలు ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
వీటిని పరిశీలించి టాలీవుడ్ డ్రగ్స్ నిందితులకు ఈడీ ప్రత్యేకంగా నోటీసులు జారీ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈడీ అధికారులు ఓ సారి ప్రశ్నించారు. కానీ అప్పుడు వారికిఎలాంటి ఆధారాలు దొరకలేదు. అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు కూడా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో ఎవరూ బయటపడలేదు. దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చారు. నిజానికి ఈడీ దర్యాప్తు చేసేది డ్రగ్స్ వాడారా లేదాఅనేది కాదు… డ్రగ్స్ కోసం చెల్లింపులు ఎలా చేశారన్నదానపైనే. అక్రమ నగదు లావాదేవీల కోణంలోనే ఈ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలా డబ్బులు చెల్లించిన విషయం బయటకు వస్తే.. నిజంగానే వారు డ్రగ్స్ కొన్నట్లుగా తేలిపోతుంది. అదే జరిగితో మరో రకంగా ఇరుక్కుంటారు.
అంటే.. అన్ని విధాలుగా కేసుల్లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు డ్రగ్స్ కొనలేదని .. డబ్బులు చెల్లించలేదని ఎలాగోలా నిరూపించేసుకుంటే సమస్య ఉండదు. ఈడీ విచారణలో ఎవరైనా పొరపాటున డ్రగ్స్ కోసం డబ్బులు చెల్లించినట్లుగా బయటపడితే… ఇక చిక్కులు తప్పనట్లే. ఆ ఒక్కలింక్ నుంచి మొత్తం ఈడీ బయటకు లాగే అవకాశం ఉంది. ఎలా చూసినా టాలీవుడ్‌ను మళ్లీ డ్రగ్స్ కేసు వెంటపడటం ఖాయంగా కనిపిస్తోంది.