కాకినాడ పోర్టును కొట్టేసిన కేసులో విజయసాయిరెడ్డి ఈడీని తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈడీ మాత్రం వదిలి పెట్టడం లేదు. వెంటపడి రావాల్సిందేనని పదే పదే నోటీసులు జారీ చేస్తోంది. గతంలో నోటీసులు జారీ చేసిన సమయంలో నిందితులు అందరూ తమకు మాయ రోగాలు ఉన్నాయని చెప్పి వెళ్లలేదు. విజయసాయిరెడ్డి తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయన్న కారణం చెప్పారు. అప్పటికి సహనం పాటించిన ఈడీ తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది.
సోమవారం విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ సారి ఆయన ఏ కారణం చెబుతారో కానీ వెళ్లకపోతే మాత్రం ఈడీ సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అరబిందో శరత్ చంద్రారెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కూడా గతంలో విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. మరోసారి వారికి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ సారి హాజరు కాకపోతే ఈడీ అరెస్టులు చేసే అవకాశం ఉంది.
కాకినాడ పోర్టును అధికార దుర్వినియోగం చేసి కొట్టేశారని పోర్టు యజమానికి సీఐడీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసులు పెట్టింది. మనీలాండరింగ్ స్పష్టంగా ఉండటంతో ఈడీ ముందుకు వెళ్లి ఏం చెప్పాలన్న అంశంలో క్లారిటీ లేక నిందితులు అందరూ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి రెండు సార్లు చూసి మూడో సారి ఈడీ రాత్రికి రాత్రి అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈడీ కేసుల్లో అరెస్ట్ అయితే అంత తేలికగా బెయిల్ రాదని నిపుణులు చెబుతున్నారు.