పాపం విష్ణు. గాయత్రి సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఓటర్ సినిమా వెనక్కి… వెనక్కి వెళ్తోంది. ఎప్పుడో పూర్తయిన ‘ఆచారి అమెరికా యాత్ర’ ఇంకా బయటకు రాలేదు. ‘కన్నప్ప’ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. `రావణ` ఉంటుందో లేదో అర్థం కాదు. ఇవన్నీ విష్ణుకి సమస్యలే. అయితే.. ఇందులోంచి తేరుకుని మరో కొత్త ప్రాజెక్టు మొదలెట్టాలన్న ఉద్దేశంలో ఉన్నాడు విష్ణు. తన తదుపరి సినిమాకి సంబంధించి ఓ కథని సిద్ధం చేశాడట. దీనికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. విష్ణుతో ‘దేనికైనా రెడీ’, ‘ఆడోరకం ఈడోరకం’ సినిమాల్ని రూపొందించారాయన. రెండూ హిట్టే. ‘ఆచారి’ కూడా ఆయనే దర్శకత్వం వహించారు. నాగేశ్వరరెడ్డిపై నమ్మకంతో.. మరో సినిమా చేయడానికి రెడీ అయిపోయార్ట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.