చంద్రబాబుకు సంబంధించిన కేసుల పిటిషన్లలో విచారణ పూర్తయితే రిజర్వ్ లేకపోయితే వాయిదాలే కానీ.. నిర్ణయాలు మాత్రం వెలుగులోకి రావడం లేదు. ఓ వైపు ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతోంది. మరో వైపు న్యాయస్థానాల్లో చంద్రబాబునాయుడు అదే పనిగా పోరాటం చేయాల్సి వస్తోంది. స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనల తర్వాత తీర్పు రిజర్వ్ చేశారు న్యాయమూర్తి . వాదనల సందర్భంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి సినిమా కథలు చెప్పారు. మూడు పది రూపాయల నోట్ల ద్వారా స్కిల్ డబ్బులు మళ్లించారట.. ఇది ఓ వ్యక్తి మెసెజుల్లో కనిపించిందట.
అలాగే బోస్, కన్వేల్కర్ మెసెజుల ఆధారంగా ఆ డబ్బు హైదరాబాద్ చేరిందని తెలుసుకున్నారట. న్యాయస్థానంలో పొన్నవోలు చెప్పిన ఈ డీటైల్స్ విని .. ఏదో సినిమాలో జరిగిన సీన్లను ఇక్కడ చెబుతున్నట్లుగా ఉన్నారని న్యాయవాదులు నవ్వుకున్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులు కూడా తప్పుడువేనని చెప్పుకొచ్చారు. బెయిల్ ఇవ్వొద్దన్నారు. సిద్ధార్థ లూధ్రా చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు. 2018 నుంచి విచారణ చేస్తున్నామని చెబుతన్నారని.. ఏం తేల్చారని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏఏజీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ప్రచారం చేసి అడ్వకేట్స్ ఎథిక్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించారన్నారు.
ఎన్నికలు వస్తున్న సమయంలో చంద్రబాబును ప్రజా జీవితానికి దూరం చేయడానికే ఇలాకేసులు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైల్లో పెట్టడం వల్ల చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదన్నారు. అన్ని విషయాలను పరిశీలించి బెయిల్ ఇవ్వాలని కోరారు. తనపై నమోదు చేసిన కేసులన్నీ చట్ట వ్యతిరేకమని.. ఏసీబీ యాక్ట్ లోని చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదని.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైనా విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ లో ఉంది. పలుమార్లు వాయిదా పడిన తర్వతా దీపావళి సెలవుల తర్వాత తీర్పును ప్రకటిస్తామని ధర్మానసం ప్రకటించింది. ఆ తీర్పు చంద్రబాబు కేసుల విషయంలో అత్యంత కీలకం కానుంది.