తెలంగాణలో గులాబీ బాస్ బహుశా ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంటారని అనుకోవచ్చు. ఒకవైపు తాను తలచుకున్న కొత్త అధికార నివాసం పనులు మొదలైపోయాయి. ఏడాదిలో అదిపూర్తయితే.. తన జాతకచక్రానికి అనుకూలమైన వాస్తు వైశిష్ట్యంతో ఏర్పడే రాజసౌధంలో తాను కొలువు తీరవచ్చు. అదే సమయంలో కొత్తగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు చోట్ల కూడా తిరుగులేని విజయాలు వారిని మరింతగా ఆనందోత్సాహాల్లో ముంచి ఉంటాయి. ఇలాంటి సంతోషభరితమైన సమయంలో.. దొరగారు ఏం చేస్తారు? కేసీఆర్ చాలా సహజంగా అనుసరించే రాచరికపు విలక్షణమైన శైలి ప్రకారం.. తనను నమ్ముకున్న భృత్యులందరికీ కానుకలు ఇచ్చేస్తారు. అంటే తెలంగాణలో తెరాస పార్టీ వారందరికీ నామినేటెడ్ పదవుల పందేరం ఇక ఊపందుకోబోతున్నదని అర్థమవుతోంది.
రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నప్పటికీ.. ప్రజాప్రతినిధి పదవులు పొందిన వారికి తప్ప.. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ప్రత్యేకించిన నామినేటెడ్ పదవుల పందేరం ఇంకా పూర్తిగా జరగలేదన్న మాట వాస్తవం. కార్యకర్తలు, నాయకులు, ఇతర పార్టీలనుంచి వస్తున్న వారు.. ఇలాంటి ఆశలను వ్యక్తం చేసిన ప్రతి సందర్భంలోనూ… ఇదిగో అదిగో అంటూ కేసీఆర్ రోజులు నెట్టేస్తున్నారు. ప్రతి పండుగకూ.. ఫలానా పండుగ తర్వాత.. అంటూ 2015 సంక్రాంతి నుంచి కూడా.. వాయిదాల పర్వమే.. ఈ పదవుల పందేరంలో నడుస్తూ ఉంది.
అయితే రాజకీయంగా ఒక వ్యూహం ప్రకారం కేసీఆర్ ఆలస్యం చేసి ఉంటారని కూడా అనుకోవచ్చు. మునిసిపాలిటీ వంటి ఎన్నికలు దగ్గర్లో ఉండగా పదవులు పంచితే కొందరిలో అసంతృప్తి వస్తుందని ఆయన అనుకుని ఉండవచ్చు. అయితే ఇప్పుడు అలాంటి ఎన్నికల పర్వం మొత్తం పూర్తయిపోయింది. మునిసిపోల్స్ కూడా ముగిసాయి. తెలంగాణలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లోనూ పార్టీ వైభవమే పరిఢవిల్లింది. పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి పనిచేశారనడానికి కూడా ఇది ఉదాహరణే అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక గులాబీ బాస్ పదవుల పందేరానికి తెరతీస్తారని భావించవచ్చు. బాస్ మదిలో ఏమున్నదో గానీ.. ఇటీవలి పార్టీ సమావేశాల్లో ఆయన ఇచ్చిన హామీని బట్టి.. త్వరలోనే నామినేటెడ్ పదవుల జాతర ఉంటుందని గులాబీశ్రేణులు ఆశగా నిరీక్షిస్తున్నాయి.