విభజన చట్టంలోని అన్ని అంశాలు సత్వరం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నదంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చేసిన తీర్మానం కొత్తగా మరో వివాదానికి బీజం వేసే పరిస్థితి కనిపిస్తోంది. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలనడంలో భాగంగా ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలకు సంబంధించిన సెక్షన్8 విషయాన్ని కూడా ఏపీ ప్రస్తావించినట్లే అనుకోవాలి.
అయితే దీనిమీద తెలంగాణ నాయకుల్లో సహజంగానే తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గత 20 నెలలుగా ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని.. అలాంటి నేపథ్యంలో సెక్షన్ 8 అమలు కోరుతూ ఏపీ తీర్మానం చేయడం దారుణం అని తెరాస ఎంపీ వేణుగోపాలాచారి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తెరాస నాయకులు ఈ అంశాన్ని సీరియస్గా పట్టించుకోకపోయినప్పటికీ.. శాసనసభలో తీర్మానం తర్వాత దశలోకి ప్రవేశించి.. సెక్షన్ 8 గురించి తెదేపా నాయకులు మళ్లీ ఏదైనా ముందుకు అడుగేస్తే.. తప్పకుండా తెలంగాణ నాయకుల వైపునుంచి కూడా వివాదం తప్పకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.
మొత్తానికి విభజన చట్టం అంశాలను తాజాగా మళ్లీ ప్రస్తావించడం, ప్రధానంగా సెక్షన్ 8 గురించిన ప్రస్తావనను తెరమీదకు తీసుకురావడం ద్వారా… మానిన గాయాన్ని తిరిగి రేపడానికి తెలుగుదేశం ప్రయత్నం చేస్తున్నట్లుగా కొందరు భావిస్తున్నారు. ఎటూ తెదేపా ప్రముఖులు ఎవ్వరూ ఇక్కడ ఉండడం లేదు. చంద్రబాబు ఎప్పుడో బెజవాడ వెళ్లిపోయారు. మరో నాలుగు నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని అక్కడకు తీసుకువెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నప్పుడు మళ్లీ ఇప్పుడు సెక్షన్ 8 అమలుగురించి కొత్తగా రభసను లేవదీయడం ఎందుకునే అభిప్రాయం వ్యక్తమవుతోంది.