జానీ మాస్టర్ కేసు టాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. బాధితురాలికి న్యాయం జరగాలన్నదే అందరి ఆకాంక్ష. నిజానికి.. ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఓ స్టార్ డాన్స్ మాస్టర్ పై ఫిర్యాదు చేస్తే.. తనకు అవకాశాలు వస్తాయా, రావా? అనే విషయం ఆలోచించలేదు. ధైర్యంగా ముందడుగు వేసి, న్యాయం కోసం పోరాడుతోంది. ఫిల్మ్ ఛాంబర్ సైతం అమ్మాయికి అండగా నిలిచింది. ఓ పెద్ద హీరో ఆ అమ్మాయికి ఫోన్ చేసి, తన సినిమాల్లో అవకాశాలు ఇస్తానని, అభయ హస్తం అందించడం నిజంగానే ఆహ్వానించదగిన పరిణామం. ఆ పెద్ద హీరో అల్లు అర్జున్ అని… సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ పేరు బయటకు వచ్చిందో, అప్పటి నుంచి ఈ చర్చ మరో రూపాన్ని సంతరించుకొంది. ‘బన్నీ మనసు గొప్పది’ అంటూ బన్నీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తోంటే, ‘ఇదే మంచితనం జగదీష్ కేసు విషయంలో ఎందుకు చూపించలేదు’ అంటూ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.
పుష్షలో కేశవ పాత్ర చాలా పాపులర్. ఆ పాత్రలో జగదీష్ నటించాడు. `పుష్ష 2` షూటింగ్ జరుగుతున్న సమయంలో జగదీష్ అరెస్ట్ అయ్యాడు. ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో తనకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో జగదీష్‌ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తరవాత బెయిల్ పై బయటకు వచ్చి, పుష్ష 2 షూటింగ్ లో పాల్గొన్నాడు కూడా. అప్పట్లో జగదీష్ బయటకు రాకపోతే, పుష్ష 2 షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. పుష్ష 2 నిర్మాతలు జగదీష్ ని బయటకు తీసుకురావడానికి అపసోపాలు పడ్డారని, జగదీష్ బెయిల్ పై వచ్చాకే, పుష్ష 2 షూటింగ్ గాడిలో పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి… జగదీష్ వల్ల అన్యాయమైపోయిన కుటుంబానికి బన్నీ ఎందుకు అండగా నిలవలేకపోయాడు? జగదీష్ తో మళ్లీ ఎందుకు నటించాల్సివచ్చింది? జగదీష్ విషయంలో ఒక న్యాయం, జానీ మాస్టర్ విషయంలో ఒక న్యాయమా? అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వర్గం కొత్త రకమైన చర్చకు తెర లేపింది. జగదీష్ విషయంలోనూ బన్నీ కాస్త కఠినంగా ఉండి ఉంటే.. ఇప్పుడు బన్నీ విషయంలో వేలెత్తి చూపించే అవకాశం ఉండేది కాదు. ఏదేమైనా ఇలాంటి సున్నితమైన విషయాల్లో సెలబ్రెటీలు ఆచి తూచి అడుగులు వేయడం తప్పనిసరి. ఎందుకంటే ఓసారి పొరపాటు చేస్తే, ఆ తప్పు ఏదో ఓ రూపంలో ఇలా గుచ్చుతూనే ఉంటుంది.