వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లోకి చేరిపోయారు. ఆయన ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లు బయటకు రాకుండా ఉన్న ఆయనకు ఇప్పుడు నిరంతరాయంగా ప్రచారం చేయడం బద్దకంగా మారింది. ఓ వైపు పరిస్థితులు పూర్తిగా తిరగబడటం.. మరో వైపు ఆందోళన అన్నీ కలిసి ఆయన ప్రచారానికి వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బస్సుయాత్ర చేశారు. లోక్ సభ నియోజకవర్గాలవారీగా అక్కడక్కడా సిద్ధం అంటూ సభలు పెట్టారు. ఆ బస్సు యాత్ర పూర్తిగా ఫెయిలయిందని వైసీపీ నేతలు గొణుక్కున్నారు.
అందుకే బస్సు యాత్ర అయిపోగానే జగన్ వంద ప్రచారసభల్లో పాల్గొంటారని ప్రచారం చేశారు. నామినేషన్ల చివరి రోజుకు బస్సు యాత్ర పూర్తి చేశారు. ఆ తర్వాత అయినా రోజూ ప్రచారం చేస్తున్నారా అంటే.. రెండు రోజులకో సారి సెలవు పెడుతున్నారు. బయటకే రావడం లేదు. ఓ సారి మేనిఫెస్టో.. మరో సారి వాస్తు మార్పులు .. మరోసారి విశ్రాంతి.. మరో సారి ఎలక్షనీరింగ్ వ్యూహాలు అంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఏం చేసినా ప్రచారానికి గ్యాప్ వస్తే ప్రజల్లో కి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అయినా సరే… జగన్ విశ్రాంతికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
జగన్ ప్రచార శైలి చూస్తే పూర్తిగా హోప్స్ వదిలేసినట్లుగా ఉందని వైసీపీ నేతలు కూడా కంగారు పడుతున్నారు. ఘోరమైన ప్రజా వ్యతిరేకతకు తోడు..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ మైన్లా పేలుతుందన్న నివేదికలు రావడంతో .. ఇక జగన్ కష్టపడటం దండగ అని భావిస్తున్నారు. డబ్బుల పంపిణీ విషయంలోనూ ఆయన వెనుకడుగు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. గెలిచే అవకాశం ఉన్న చోటల మాత్రమే డబ్బులు పంపిణీ చేయాలని సూచించే చాన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.