ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటీవలి కాలంలో ఢిల్లీలోనే ఎక్కువ పని పడుతోంది. కష్టకాలం ముంచుకొచ్చిన ప్రతీసారి ఢిల్లీ వెళ్తున్నారు. పనులను ఫలప్రదం చేసుకుని వస్తున్నారు. ఆయన ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి ఏం జరిగిందని టీడీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఏం జరిగిందో.. ఏం జరగాలని ఢిల్లీ టూర్లకు వెళ్లారో సీఎం జగన్కు బాగా తెలుసు కాబట్టి అవసరం పడినప్పుడల్లా ఢిల్లీ వెళ్తున్నారు.
పది రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధానితో భేటీ అయ్యారు. అప్పటి వరకూ వైఎస్ వివేకా హత్య కేసులో ఇక అవినాష్ రెడ్డి అరెస్టే మిగిలింది అనుకుంటూ ఉన్నారు కానీ..ఇప్పుడు ఆ కేసు విచారణ ఎక్కడిదక్కడ ఉండిపోయింది. దర్యాప్తు అధికారిని మార్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశంతో మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దర్యాప్తు అధికారిని ఎవరిని నియమిస్తారన్నది కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్లడం అనూహ్యమే.
అయితే ఈసారి భేటీలో సీఎం ఎవరెవర్ని కలుస్తారు… టూర్ అజెండా ఏంటన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మార్చి 17న పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో మోదీతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చర్చించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు కూడా సీఎం జగన్ వెంట ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా జగన్ కలిశారు. ఈ సారి ఢిల్లీలో ప్రధానిని కలుస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు.