2022లో జమిలీ ఎన్నికలు వస్తాయంటూ… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆన్ లైన్ ప్రెస్కాన్ఫరెన్స్లో చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనూ చర్చనీయాంశం అయ్యాయి. మంత్రి బొత్స ప్రెస్మీట్ పెట్టి… జమిలీ ఎన్నికలు ఎందుకు వస్తాయి… ఐదేళ్ల తర్వాతే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. కానీ.. ఢిల్లీలో పరిమాణాలు మాత్రం మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో జరిగే అన్ని ఎన్నికలకూ ఒకే ఒక ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. బీజేపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే ఓటరు జాబితాను చేర్చింది. అధికారంలోకి వచ్చాక లా కమిషన్, ఈసీలను కేంద్రం సమాయత్తం చేసింది. పార్లమెంట్లో మెజారిటీ, దాదాపు 20 రాష్ట్రాలు తమ చేతికిందే ఉండడంతో ఇపుడు అడుగు ముందుకేస్తోంది.
2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వెంటనే… అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షుడ్ని ఆహ్వానించారు. మొత్తం ఐదు అంశాలు ఎజెండాగా చెప్పినప్పటికీ అసలు విషయం మాత్రం జమిలీ ఎన్నికలు. గతంలో జమిలీ ప్రతిపాదన వచ్చినప్పుడు లా కమిషన్ ముందు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ , టీడీపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు జమిలీ ఎన్నికలను స్వాగతించే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. లా కమిషన్కు లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు.
అప్పటి నుంచే కసరత్తు ప్రారంభమయిందన్న చర్చ జరుగుతోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి వీలైనంత త్వరగా కసరత్తు పూర్తి చేసి 2022లోనే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. 2022లో జమిలీ ఎన్నికలు అనే ప్రతిపాదనకు ఓ ప్రాతిపదిక ఉంది. ఆ ఏడాది దాదాపుగా ఎనిమిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఏడాది మరో ఐదు రాష్ట్రాలకు జరగాల్సి ఉంది. 2021లో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటన్నింటినీ కలిపేసి.. 2022లో పెట్టడానికి.. బీజేపీ అంతర్గత కసరత్తు చేస్తోందంటున్నారు. ఒకే దేశం.. ఒకే విధానం.. బీజేపీ కాన్సెప్ట్. దాన్ని అమలు చేయడానికి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆగే పరిస్థితి లేదు. అందుకే.. జమిలీ ఎన్నికలు ఖాయమన్న అభిప్రాయం అంతకంతకూ బలపడుతోంది.