తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే కథనాలు మొదట్లో బాగా వినిపించేవి. కుమారుడు కెటిఆర్ ఆందుకోసమే సింగపూర్‌కు వెళ్లివచ్చారని కూడా చెబుతుండేవారు. తెలుగుదేశం నాయకుల నుంచి వచ్చే ఈ కబుర్లు పెద్దగా పట్టించకోనవసరం లేదని టిఆర్ఎస్ నాయకులు చెప్పడమే గాక పరిశీలకులు కూడా తోసిపారేసేవారు. కెటిఆర్ కవిత మీడియాలో మాట్లాడినప్పుడు కూడా ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఆయన ఆరోగ్యం లక్షణంగా వుందని నొక్కి చెప్పేవారు. అయితే కెసిఆర్ మాత్రం అప్పటికి నేను బతికుంటే .. అంటూ మాట్లాడేవారు. పెద్దవాళ్లు యథాలాపంగా అనేమాట తప్ప దానికి పెద్ద ప్రాధాన్యత నివ్వొద్దని కెటిఆర్ స్పష్టం చేసేవారు. అయితే శాసనసభలో ఎక్కువ సేపు కూచున్నప్పుడు ముఖ్యమంత్రి అలసి పోవడమే గాక వాపులు కూడా కనిపిస్తున్నాయని ఒక ప్రముఖ పార్టీ శాసనసభా నాయకుడు తన పరిశీలన చెప్పారు.
ఇంతలోనే టిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుడు అయితే కెసిఆర్‌కు బాగా సన్నిహితుడూ అయిన ఒక ఒక మిత్రుడు మొదటిసారి కేసిఆర్ ఆరోగ్యసమస్యలు బాగానే వున్నాయన్నట్టు మాట్లాడారు. ఆయన స్వభావాన్ని బట్టి చూస్తే అధిష్టానం ఆమోదం లేకుండా పెదవి విప్పే రకం కాదు. అంతకు ముందు టిన్యూస్‌లో సుదీర్ఘంగా పాల్గొన్నప్పుడు కూడా కెసిఆర్ ‘బతికి వుంటే చూస్తాను’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఆయనకు జ్వరం మూడు రోజుల విశ్రాంతి వార్తలపై సోషల్ మీడియాలో అనేక వ్యాఖ్యానాలు తిరుగాడుతున్నాయి. గతంలో వలె పూర్తిగా ఖండించడం గాక ఎంతో కొంత సమస్య వుందని భావించడానికి ఇవన్నీ కారణమవుతున్నాయి. లేక వారసత్వ ప్రక్రియ త్వరితంగా పూర్తి చేయడానికి ఇదంతా జరుగుతున్నదా అనే సందేహం కూడా ప్రతికూల శిబిరంలో వుంది. కెసిఆర్ ఆరోగ్యంగా వున్నారని విశ్వసిస్తూనే వుండాలని ఆశిస్తూనే ఈ గందరగోళాన్ని తొలగిస్తారని ఆశిద్దాం.