ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ .. సిద్దిపేటలో తప్ప ఎక్కడా ఇటీవలి కాలంలో కనిపించని హరీష్ రావుకు మరోసారి ప్రాధాన్యం లభిస్తోంది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో.. రంగారెడ్డి జిల్లా బాధ్యతను హరీష్‌కు కేసీఆర్ అప్పగించారు. ఆ తర్వాత మళ్లీ సైలెంటయ్యారు. ఈటల రాజేందర్ ఇష్యూ తర్వాత.. మళ్లీ కీలక కార్యక్రమాల్లో హరీష్ రావును కేసీఆర్ భాగస్వామ్యం చేయడం ప్రారంభించారు. కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కరోనా టాస్క్‌ఫోర్స్‌లో హరీష్ రావు కూడా కీలక బాధ్యతలు చేపట్టారు.
కేటీఆర్, హరీష్‌లలో ఒకరు తెలంగాణ లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర మంత్రులతో సమన్వయం చేస్తుంటే మరొకరు ఆక్సిజన్ కొరత , ఇంజక్షన్ల సరఫరాలను పర్యవేక్షిస్తున్నారు. నిజానికి ఈటలను బర్తరఫ్ చేయడానికి ముందే కేసీఆర్.. వైద్య ఆరోగ్య శాఖను తాను తీసేసుకున్నారు. అప్పుడే.. హరీష్ రావు కి ఉన్న శాఖలతో పాటు ఆరోగ్య శాఖ పై దృష్టి పెట్టాలని గత నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్ హరీష్ రావుకి సూచించినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అప్పటినుండి మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో కరోనా కట్టడి పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శాఖ ని పూర్తి స్థాయి లో ప్రక్షాళన భాగంగానే ప్రతి నిత్యం హాస్పిటల్స్ వద్ద సమాచారాన్ని సేకరిస్తున్నారు మంత్రి హరీష్.
అందుకే గడ్కరీతోనూ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ భేటీలోనూ పాల్గొన్నారు. అయితే హరీష్‌కు బాధ్యతలు ఇచ్చినట్లుగా చెప్పినా.. కేటీఆర్‌ను కూడా ఇన్వాల్వ్ చేయడంతో ఆయనకు పని వరకేనని స్పష్టమవుతోందంటున్నారు. అయితే..అనూహ్యంగా ప్రభుత్వంలో ప్రాధాన్యం పెరగడం మాత్రం.. కేసీఆర్ వ్యూహాత్మకంగా వేసిన అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఈటల… హరీష్ రావు సన్నిహుతులని.. టీఆర్ఎస్లో ఎప్పట్నుంచో ప్రచారం ఉంది.