కాంగ్రెస్ తో పొత్తు వద్దే వద్దని.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రచ్చ రచ్చ చేస్తున్నారు. పొత్తుల గురించి.. అసలు చర్చ ఎందుకంటూ… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేరుగా వార్నింగ్ ఇచ్చినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వద్దనేది తన అభిప్రాయం కాదని.. క్యాడర్ అభిప్రాయం అంటూ.. తన వాయిస్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించి … తన కుమారుడు శ్యాంబాబుకి టిక్కెట్ కూడా చంద్రబాబు వద్ద ఖరారు చేయించుకున్న కేఈ కృష్ణమూర్తి.. పార్టీ లో అంతర్గతంగా చర్చించాల్సిన అంశంపై.. ఇంత దూకుడుగా వెళ్లడానికి కర్నూలు స్థానిక రాజకీయాలే కారణమని టీడీపీలో చర్చ జరుగుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికలకు ముందు కొంత మంది.. ఎన్నికల తర్వాత మరికొంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి.. తమ దారి తాము చూసుకున్నారు. కానీ కొద్ది మంది నేతలు మాత్రం.. కాంగ్రెస్ లోనే ఉన్నారు. అలాంటి వారిలో.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు.. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఒకరు. ఆయనకు కర్నూలు జిల్లాలో బలమైన వర్గం ఉంది. కేఈ, కోట్ల వర్గాలకు.. దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. డొన్ నియోజకవర్గంలో కేఈ వర్సెస్ కోట్ల కుటుంబాలే అన్నట్లు రాజకీయాలు నడిచేవి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే.. కలసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలసి పని చేయడం కన్నా.. ముందు బలమైన నేతగా.. కోట్ల కచ్చితంగా రెండు అసెంబ్లీ సీట్లను… అడిగే అవకాశం ఉంది. అందులో కచ్చితంగా డోన్ ఉంటుంది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన భార్య సుజాతమ్మ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ డోన్ సెగ్మెంట్ లో తన సోదరులైన కేఈ ప్రతాప్ లేదా.. కేఈ ప్రభాకర్ లతో పోటీ చేయించాలని కేఈ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ తో పొత్తంటూ ఉంటే.. కర్నూలులో కేఈ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది.
ఈ కారణంగానే కేఈ కృష్ణమూర్తి కాంగ్రె్స తో పొత్తు విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యాఖ్యలు చేస్తున్నారు. పొత్తులపై మాట్లాడవద్దని చంద్రబాబు చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదని కర్నూలు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీతో పొత్తు ఉండదని.. టీడీపీ హైకమాండ్ పైకి చెబుతున్నప్పటికీ.. జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులు చూసి.. టీడీపీ నేతలు కూడా.. కాంగ్రెస్ తో నడవక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.కాంగ్రెస్ కు అంతో ఇంతో బలమైన నేతలున్న దగ్గర పొత్తుపై టీడీపీలో వ్యతిరేకత వ్యక్తమవడం ఖాయమని… కేఈ ఉదంతంతో… టీడీపీ వర్గాలు అంచనాలు వేసుకుంటున్నాయి.