పోలీసులకు ఎక్కడ కనిపిస్తే అరెస్టు చేస్తాననో బయట కూడా కనిపించని మోహన్ బాబుకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఇద్దరు కుమారులు. పదే పదే గొడవలు పెట్టుకుని పోలీస్ స్టేషన్ వరకూ వెళ్తున్నారు. తాజాగా మంచు మనోజ్.. ఏడు పేజీల ఫిర్యాదు లేఖతో పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణుతో పాటు వినయ్ మహేశ్వరి కలిసి తన ప్రాణానికి హాని కల్పించే ప్రయత్నంలో ఉన్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అసలు ఆ లేఖలో పూర్తిగా ఏముందో ఇంకా బయటకు రాలేదు.
నిజానికి ఈ ఫిర్యాదును ఆళ్లగడ్డకు వెళ్లక ముందు పోలీసులకు ఇవ్వాలనుకున్నాడు మనోజ్. కానీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన తల్లి నిర్మల మనోజ్ తీరును తప్పు పడుతూ విష్ణును సమర్థిస్తూ పహాడిషరీఫ్ పోలీసులకు లేఖ రాశారు. ఇప్పుడు మనోజ్ ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారం పోలీసులకు కూడా తలనొప్పిగా మారుతోంది. ఆయనది కుటుంబ సమస్యగా పోలీసులు చెబుతున్నారు. అయితే జర్నలిస్టుపై చేసిన హత్యాయత్నం కేసును మాత్రం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
మంచు విష్ణు ఇప్పటికే మనోజ్ తనపై సోషల్ మీడియా పోస్టులు పెట్టకుండా కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ కేసులు పెట్టకుండా ఎలాంటి ఉత్తర్వులు తెచ్చుకోలేదు. ఇవ్వరు కూడా. మనోజ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకపోయినా ఆయన చేయాలనుకున్నది ఆయన చేస్తున్నారు. ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించకుండా మోహన్ బాబు ఎందుకు సాగతీసుకుంటున్నారో కానీ రోజు రోజుకు వారుపోరాటం రోడ్డు మీదనే ఉంటోంది.