ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ సీఐడీకి పని కల్పిస్తోంది. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే అనేక విచారణలు సీఐడీ చేస్తోంది. రాజధాని భూముల కేసుల్లో సీఐడీ చేస్తున్న విచారణ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఇక సోషల్ మీడియా అరెస్టుల సంగతి చెప్పాల్సిన పని లేదు. చివరికి రఘురామపై సుమోటోగా దేశద్రోహం కేసు పెట్టి మరింత పని కల్పించుకున్నారు. తాజాగా గత ప్రభుత్వ హయాలో ఫైబర్‌నెట్‌లో అక్రమాలు జరిగాయని.. సీమెన్స్ ప్రాజెక్ట్‌లో అక్రమాలు జరిగాయని విచారణ జరపాలని సీఐడీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ సర్కార్ అనుకుంది. ఆ మేరకు కేబినెట్లో తీర్మానం చేసి సీబీఐకి పంపారు. కానీ సీబీఐ పట్టించుకోలేదు. దీంతో కనీసం సీఐడీతో అయినా దర్యాప్తు చేయిద్దామని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుని ఆ మేరకు రంగంలోకి దిగింది.
సీఐడీ తీరుపై ఇప్పటికే రాజకీయంగా అనేక విమర్శలు ఉన్నాయి. సీఐడీ ఏడీజీగా ఉన్న సునీల్ కుమార్‌పై వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఆయనకు తోడుగా విజయ్ పాల్ అనే అధికారి రాజకీయ కేసుల్లో మరీ హడావుడి చేస్తూంటారు. ఆయనే రఘురమతో పాటు మీడియాపైనారాజద్రోహ కేసులు సుమోటోగా పెట్టడంలో ఫిర్యాదుదారు. ఆయన ఇటీవల రిటైరయ్యారు. అయితే ప్రభుత్వం రెండు రోజులు గడవక ముందే మళ్లీ సీఐడీలోకి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పేరుతో కాంట్రాక్ట్ పద్దతిలో విధుల్లోకి తీసుకుంది. ఇప్పుడు ఆయనే ఈ కేసులను తీసుకుని.. ప్రభుత్వ పెద్దలు ఎవర్ని చెబితే… వారిని టార్గెట్ చేయడానికి వెనుకాడరన్న చర్చ కూడా నడుస్తోంది.
ఫైబర్ నెట్లో వేయి కోట్లకుపైగా అవినీతి జరిగిందని.. దానికి లోకేష్ బాధ్యుడని వైసీపీ నేతలు.. విమర్శిస్తూ ఉంటారు. విజయసాయిరెడ్డి కూడా అదే చెబుతూంటారు. అదే లోకేష్ నిర్వహించిన ఐటీ .. పంచాయతీరాజ్ శాఖకు.. ఫైబర్ నెట్‌కు ఏం సంబంధమో తెలియని వాళ్లు ప్రభుత్వంలో ఉన్నారని టీడీపీ నేతలు అంటూ ఉంటారు. అసలు ఈ ప్రాజెక్టు మీద గత ప్రభుత్వం ఖర్చు చేసింది రూ. మూడు వందల కోట్లు మాత్రమే. సీబీఐకి సిఫార్సు చేసినా స్పందన లేకపోవడంతో..ప్రాథమిక ఆధారాలు లేవన్న అభిప్రాయం ఇప్పటికే ఏర్పడింది.
రాజకీయంగా క్లిష్టపరిస్థితుల్లోకి దిగజారిపోతున్న వైసీపీ సర్కార్‌కు ఇప్పుడు ఇంటా బయటా చెప్పలేనన్నిసమస్యలు ఉన్నాయి. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్తగా సీఐడీ దర్యాప్తులు అంటున్నారన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో చివరికిఅన్న క్యాంటీన్ల నిర్మాణంలోనూ వేల కోట్లు తిన్నారని.. వాటర్ బాటిళ్లకు వందల కోట్లు ఖర్చు పెట్టారంటూ ఆరోపణలు చేసిన పెద్దలు.. చివరికి ఏ ఒక్క దాంట్లో అవినీతిని కానీ.. వాటికి సంబంధించిన జీవోలను కానీ బయట పెట్టలేదు. దీంతో తప్పుడు ఆరోపణలు చేశారని ఇప్పుడు విస్తృత ప్రచారాన్ని టీడీపీ నేతలు చేస్తున్నారు.