ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ఉద్రిక్తతలకు కేంద్రంగా వుండిన పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో పునరావృతమైంది. ఎమ్మెస్సీ చదువుతున్న మురళి అనే విద్యార్థి ఉద్యోగ నియామకాల్లో జాప్యంతో కుటుంబ భారం మోయలేక బలవంతాన ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలచివేసింది. సిద్దిపేట జిల్లా దౌలాపూర్కు చెందిన మురళి తండ్రి లేని కారణంగా పెద్ద కుటుంబాన్ని నెట్టుకురావలసి వుంది. ఒకవైపున చదువుకుంటూనే మరోవైపున డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అవి పదేపదే వాయిదా పడటంతో మనస్తాపానికి గురవుతున్నారు. చివరకు ఒత్తిడి తట్టుకోలేక నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన విద్యార్థుల్లో ఎంత ఆగ్రహం కలిగించిందంటే మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన విసి రామచంద్రాన్ని వారు వెంటతరిమారు. పైగా ఆత్మహత్యనోట్ను మార్చివేశారని కూడా విద్యార్థులు మురళి స్నేహితులు ఆగ్రహించారు. చదువుకోలేకపోవడం వల్లనే తాను ప్రాణం తీసుకుంటున్నానని మురళి రాసినట్టు చిత్రించడం కుట్ర అని వారంటున్నారు. నోట్లోపేజీలు ఇంకు కలరు, భాష కూడా మారిపోవడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఇక ఈ విషాదంపై నిరసన తెల్పుతున్న విద్యార్థులపైన పోలీసులు లాఠీచార్జి చేయడం ఉద్రిక్తత పెంచింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులపైనా దాడి చేశారు పోలీసులు. ఒక్కసారిగా ఓయు అట్టుడికిపోయింది. కోదండరాం ఆధ్వర్యంలో జెఎసి తలపెట్టిన కొలువల కొట్టాల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఇదంతా చేసిందని మరో ఆరోపణ వినవస్తున్నది. ఉద్యమ కాలంలో ఆత్మహత్యలనే ప్రధాన ఆయుధంగా చేసుకున్న టిఆర్ఎస్ ఇప్పుడు రైతులు పోలీసులు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడాన్ని తీవ్రంగా తీసుకోకపోగా వారిపై రకరకాల దుష్ప్రచారాలకు పాల్పడుతుండడం విమర్శకు దారితీస్తున్నది. ఏమైనా ఆత్మహత్యలు ఎంత మాత్రం మంచిది కాదని అందరూ అంగీకరిన్తున్నాకు.