తెలుగుదేశం పార్టీ బీజేపీతో పరిచయాలు పెంచుకునేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో అడగకుండానే మద్దతు ప్రకటించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే ఉత్సాహం చూపిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లడానికి రెండు రోజుల ముందు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. మద్దతు కావాలని బీజేపీ అడగలేదు. పైగా కీలకమైనన్ని ఓట్లు టీడీపీకి లేవు. కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. లోక్సభలో ముగ్గురు, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. వీరంతా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కడ్కు మద్దతుగా ఓటేయనున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి గత ఎన్నికలకు ముందు బయటకు వచ్చిన తర్వాత బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడతో సైలెంట్ అయ్యారు. బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. వీలైనప్పుడు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతును బీజేపీ నేతలు అడగకపోయినప్పటికీ సామాజిక న్యాయం కోసం తాము మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము.., తెలుగుదేశం పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొన్నారు.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతు ఎన్డీఏకు ప్రకటించింది. బీజేపీ నేతలు అడిగారో లేదో స్పష్టత లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికిప్పుడు వేసుకున్న రాజకీయ ప్రణాళికల ప్రకారం బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలని అనుకోవడం లేదు. ఇతర విపక్ష పార్టీలతో కానీ.. కాంగ్రెస్ పార్టీ కూటమి అయిన యూపీఏతోనూ కలిసే అవకాశాలు లేవు. బీజేపీతో గత శుత్రుత్వాన్ని వీలైనంతగా తగ్గించుకుని సుహృద్భావ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు.