ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా చేస్తుందో.. రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందో కానీ… ఏ క్షణమైనా మూడు రాజధానులు అని అదే పనిగా ప్రకటనలు చేస్తోంది. సీఎం జగన్ ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయవచ్చని..దానికి న్యాయస్థానాల అనుమతి అక్కర్లేదని వాదిస్తున్నారు. విశాఖలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకుని పరిపాలించడానికి జగన్కు ఎవరి పర్మిషన్ అక్కర్లేదని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. అయితే.. అంత మాత్రాన.. మూడు రాజధానులు ఏర్పడినట్లేనా.. అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
మూడు రాజధానుల అంశం.. అనేక న్యాయపరమైన చిక్కులతో ముడిపడిపోయింది. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను రాజధాని రైతులు ఏపీ హైకోర్ట్ లో సవాల్ చేశారు. దీనిపై హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం గతంలోనే ‘స్టేటస్ కో’ విధించింది. విజిలెన్స్ కార్యాలయాలను తరలించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్ట్ అప్పట్లో సస్పెండ్ చేసింది. ప్రస్తుత త్రిసభ్య ధర్మాసనం కూడా ‘స్టేటస్కో ఎత్తివేసేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్ వెళ్లినా 2020 ఆగస్ట్ 26వ తేదీన స్టేటస్ కోను ఎత్తివేసేందుకు నిరాకరించింది. కేవలం విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ హైకోర్ట్ కు సుప్రీంకోర్ట్ సూచించింది.
హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మేలో ఈ కేసు విచారణ చేపట్టినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగస్ట్ 23వ తేదీకి విచారణను వాయిదా వేసింది. కనీసం విచారణ పూర్తి అయి తీర్పు వచ్చేందుకు వచ్చే ఏడాది జనవరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో మూడు రాజధానుల అంశం కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ.. మూడు రాజధానుల గురించే జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేసి వచ్చారంటూ ప్రచారం చేస్తున్నారు. సజ్జల కూడా చివరికి అదే చెబుతున్నారు. ఏ క్షణమైనా వెళ్తామంటున్నారు. అలా వెళ్లే పని అయితే ఇప్పటి వరకూ ఎవరు ఆపారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.