మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి వారం రోజుల వ్యవధిలో రెండో లేఖ రాశారు. అంతకు ముందు రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ పెట్టాలని…అది వైఎస్ కోరిక అని చెబుతూ లేఖ రాసిన ఉండవల్లి తాజాగా… రాజమండ్రిలోని తెలుగు వర్శిటీ భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చి పంపిణీ చేయడానికి నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉంది. అది ఇంకా పంపకం కాలేదు. వివిధ చోట్ల ఉన్న కేంపస్ల స్టేటస్ కూడా అదే. అయితే.. పంపకాలు జరగక ముందే.. జగన్మోహన్ రెడ్డి ఆ భూముల్ని ఇళ్ల స్థలాలుగా మారుస్తున్నారన్నది ఉండవల్లి అభ్యంతరం. ఆయన లాయర్ కాబట్టి.. లా పాయింట్ చెప్పి… జగన్ కు లేఖ రాశారు.
తెలుగు విశ్వవిద్యాలయం విభజన పూర్తి అయితే.. రాజమండ్రిలోని క్యాంపసే పూర్తి స్థాయిలో ఏపీ తెలుగు విశ్వవిద్యాలయంగా మారుతుందని.. చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఓ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ… కొలువై ఉంటుందనుకున్నారు. భారీగా ఉన్న భూములు ఇతర మౌలిక సదుపాయాలతో ఆ యూనివర్సిటీ అభివృద్ధి చెందుతుందనుకున్నారు. కానీ అధికారులు ఆ భూమిలో ఇళ్ల స్థలాలు చూశారు. వెంటనే మార్కింగ్ చేశారు. దీంతో రాజమండ్రిలోని ప్రముఖుల్లో అలజడి ప్రారంభమయింది. రాజమండ్రికే తలమానికంగా నిలుస్తుందని భావించిన తెలుగు వర్సిటీకి ఈ పరిస్థితి ఏమిటన్న ఆందోళనతో… ప్రభుత్వానికి లేఖలు రాయడం ప్రారంభించారు.
తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇంకా విభజించలేదని.. మరొకటనే వాదనలను … ప్రభుత్వం ఖాతరు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రభుత్వం… పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్న లక్ష్యం పెట్టుకుంది. అందు కోసం.. పేదల వద్ద ఉన్న అసైన్డ్ భూములన్నింటినీ లాగేసుకున్నారు. ఇప్పుడు యూనివర్శిటీ భూముల విషయంలో… లేఖలు రాసినంత మాత్రం.. ఆగే పరిస్థితి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ విషయం ఉండవల్లీకి తెలియనిదేం కాదు. కానీ… అయిననూ ఓ ప్రయత్నం చేయాలన్నట్లుగా పరిస్థితి మారింది.