తెలుగు రాష్ట్రాల మధ్య ఫ్రెండ్లీ రాజకీయ దాదాగిరి ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్‌కు వెళ్లి సీఎం జగన్ పేరు ఎత్తకుండా ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని విమర్శించారు. ఆ వెంటనే… ప్రతీ దానికి ప్రభుత్వం తరపున మాట్లాడాటనికి తెర ముందుకు వచ్చే సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. దాదాగిరి చేస్తోందని ఎవరని ఎదురు ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ దాదాగిరి చేయడం వల్ల 30 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయిందన్నారు. వీరి విమర్శలు చూసిన వారికి.. మళ్లీ కృష్ణాజలాల్లో రాజకీయ నిప్పులు పోయడానికి రంగం సిద్ధం చేసుకున్నారన్న అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది.
ఇటీవల తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య కొన్ని లావాదేవీలు జరిగాయి. అవి చాలా స్మూత్‌గా జరిగాయి. అయితే ఇవి అధికారికమే అయినా రాజకీయమే. మొదటిది.. సజ్జల రామకృష్ణారెడ్డి తన ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖ అధికారిని నియమించుకోవాలనుకున్నారు. దానికి ఆయన తెలంగాణ సర్కార్‌కు ఇలా దరఖాస్తు పెట్టుకోగానే అలా ఆమోదం లభించింది. ఆ తర్వాత ఏపీ సర్కార్ వాడుకుంటున్న స్కూళ్లలో మౌలిక వసతులు అభివృద్ధి చేసే సాఫ్ట్వేర్ నాడు-నేడును తెలంగాణ సర్కార్ వాడుకోవాలనుకుంది. అడగగానే ఉచితంగా ఇచ్చేయడానికి ఏపీ సర్కార్ ఎన్వోసీ ఇచ్చింది. దీంతో రెండు ప్రభుత్వాలు మధ్య పరస్పర సహకారం ఉందని సలువుగానే అందరికీ అర్థమైపోతుంది.
అయితే.. రెండు ప్రభుత్వాలు.. పూర్తి స్థాయిలో నీళ్ల విషయంలో మాత్రం.. రాజకీయ విమర్శలకు దిగుతున్నాయి. స్వయంగా కేసీఆర్ ఏపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. అటు వైపు నుంచి సీఎం తర్వాత సీఎం అంతటి సజ్జల స్పందిస్తున్నారు. కానీ సమస్య పరిష్కారం కోసం… చర్చలంటూ ఎవరూ ప్రణాళిక సిద్ధం చేసుకోలేకపోతున్నారు. దీంతో ఇదంతా.. వ్యూహాత్మకంగా చేస్తున్నారన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతోంది. అసలు నదీ బోర్డును కేంద్రం తన అధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా ఈ విమర్శలు ప్రారంభం కావడం రాజకీయమేనని కొంత మంది గట్టిగా నమ్ముతున్నారు.