ఇప్పటి వరకూ దాదాపుగా రెండు నెలలుగా జాబితాల పేరుతో కసరత్తు చేస్తూ.. పార్టీ నేతల్ని టార్చర్ పెట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు ఆ నాలుగు జాబితాల్ని పక్కన పెట్టి మళ్లీ కొత్త స్క్రిప్ట్ ప్రారంభించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రకటించిన పేర్లలో సగం మంది ఎందుకూ పనికి రారని.. వారిని మార్చాల్సిందేనని నివేదికలు అందాయని అంటున్నారు. దీంతో అనేక మంది పేర్లను మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంత మందికి టిక్కెట్లు ప్రకటించినా వారు తాము పోటీ చేసేది లేదంటున్నారు. గుమ్మనూరు జయరాం పూర్తిగా డిటాచ్ అయిపోయారు.
ఆయన స్థానంలో బీవై రామయ్య అనే నేతకు చాన్సిస్తామని జగన్ అంటున్నారు. ఈ బీవై రామయ్య ఎప్పటి నుండో జగన్ వెంట నడుస్తున్నారు. ఆయనకే ఎంపీ సీటు అని ఆశ పెడుతున్నారు. కానీ ప్రతి ఎన్నికలకు ముందు ఎవర్నో తెచ్చి నిలబెడుతున్నారు. ఈ సారి కూడా అదే చేసే చాన్స్ ఉంది. ఎమ్మిగనూరు నుంచి మాచాని వెంకటేష్ అనే పేరు ప్రకటించారు కానీ ఇప్పుడు బుట్టా రేణుక పేరు తెరపైకి తెచ్చారు. విజయవాడ సెంట్రల్ సహా చాలా నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థులను మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మంది నియోజకవర్గాల మార్పును ఇష్టపడటం లేదు.
మళ్లీ మొదటి నుంచి మొదలు పెడితే.. సగం వరకూ రాకుండానే రేసు పూర్తవుతుందని.. తమ నియోజకవర్గం తమకు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. టిక్కెట్ రాని వాళ్లు ఇండిపెండెంట్ లు గా అయినా పోటీకి దిగుతామని సవాల్ చేస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాల్లోని వారు కూడా అదే పని చేస్తున్నారు. దీంతో వైసీపీలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి.