తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పట్లో విమానయాన యోగం ఉన్నట్టు కనిపించడం లేదు! విశాఖ విమానాశ్రయంలో ఆయన చేసిన వీరంగం అందరికీ తెలిసిందే. బోర్డింగ్ పాస్ ఇవ్వలేదంటూ సిబ్బందిపై చిర్రుబుర్రులాడారు. దాంతో కొన్ని విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించేశాయి. ఆ తరువాత, హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వచ్చేందుకు ప్రయత్నిస్తే… శంషాబాద్ విమానాశ్రయంలో కూడా అవమానం ఎదురైంది! అయినా ఆయన పంతం వీడలేదు. తనకు ప్రయాణ అనుమతులు ఇవ్వాలంటూ విమానయాన సంస్థల తీరుపై హైకోర్టును ఆశ్రయించారు జేసీ. అయితే, అక్కడ కూడా జేసీకి అక్షింతలు తప్పలేదు.
ఎయిర్ లైన్స్ సంస్థలు తనపై పెట్టిన నిషేధాన్ని సవాల్ చేస్తూ జేసీ వేసిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దివాకర్ ట్రావెల్స్ సంస్థల్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఎలా స్పందిస్తారు..? ప్రయాణాలకు అనుమతి ఇస్తారా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయనీ, కాబట్టి ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండటంతో విమాన ప్రయాణానికి అనుమతి ఇవ్వాలంటూ జేసీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, విమానయాన సంస్థలు వాదనను వినకుండానే ప్రయాణ అనుమతులపై స్పందించడం కుదరదు అని కోర్టు స్పష్టం చేసింది. కనీసం విదేశీ విమానయాన సంస్థల్లో ప్రయాణించేందుకైనా ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలంటూ జేసీ కోరారు.
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు ఓటేసేందుకు, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఓ ప్రత్యేక విమానంలో జేసీ ఢిల్లీ వెళ్లారు. నిషేధం కొనసాగుతూ ఉండటంతో ఇలా వెళ్లాల్సి వచ్చింది. నిజానికి, ఈ వివాదాన్ని పెంచి రాజేసుకుంటున్నది జేసీ వైఖరే అని చెప్పొచ్చు! ఈ వ్యవహారం జాతీయ స్థాయి టెన్షన్ రావడంతో వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీంతో విమానయాన సిబ్బందికి క్షమాపణలు చెప్పేసి, ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారేమో అనుకున్నారు. కానీ, ఆయన ముఖ్యమంత్రి సూచనల్ని వినకుండా.. విషయాన్ని హైకోర్టు వరకూ తీసుకెళ్లారు. విశాఖ ఎయిర్ పోర్టులో తన వైఖరిని సమర్థించుకుంటూ ఆ మధ్య ఓ స్టింగ్ ఆపరేషన్లో కూడా దొరికేశారు. దీంతో జేసీ వ్యవహారం టీడీపీకి తలవంపులుగా మారుతోందని అధికార పార్టీ వర్గాల్లో చర్చ పెరిగింది. సీఎం చెప్పినట్టు జేసీ వ్యవహరించి ఉంటే వ్యవహారం ఇక్కడి వరకూ వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.