లెక్కల్లో రెండు రెళ్ళు నాలుగే! రాజకీయాల్లో రెండు రెళ్ళు నాలుగే కాదు…ఎంతైనా కావచ్చు! ఈ ఫార్ములాను అర్ధంచేసుకోలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంటలో ప్రభుత్వాన్ని పడేయగలనని బోర్లా పడిపోయారు. ఇలాంటి పరాభవమే తెలంగాణాలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకి జరిగింది.
తనతో టచ్ లో వున్న 21 మంది తమపార్టీలోకి వచ్చిన గంటలో తెలుగుదేశం ప్రభుత్వం పతనమౌతుందన్న జగన్ లెక్కకు బేసిస్ ఏంటో ఆయనకే తెలియాలి…ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లునో, మైసూరా రెడ్డినో, మరే సీనియర్ ని అడిగినా అది జరిగే పని కాదని చెప్పి వుండేవారే! జగన్ కి ఎవరి మాటా వినే పద్ధతి లేదన్న ఫిర్యాదు నిజమేనని ”లెక్క తప్పడాన్ని” బట్టి స్పష్టమైంది.
175 మంది ఎమ్మెల్యేలు వున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 102 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం లో చేరిన ఇద్దరు ఇండిపెండెంటు ఎమ్మెల్యేలు, నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు వున్నారు. అంటే తెలుగుదేశం శిబిరంలో ఎమ్మెల్యేలు 108 మంది. మిగిలిన 67 మందీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే! జగన్ లెక్క ప్రకారం తెలుగుదేశం నుంచి 21 మందీ జగన్ పార్టీలో చేరితే తెలుగుదేశం బలం 87 కి తగ్గి వైఎస్ ఆర్ కాంగ్రెస్ బలం 88 కి పెరుగుతుంది.
ఆపరిస్ధితి వస్తే పార్టీ మారిన 21 మందినీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనర్హులుగా ప్రకటిస్తారు. జగన్ బలం అలాగే వుంటుంది. తెలుగుదేశం బలం 108 నుంచి 87 కి తగ్గినా ప్రభుత్వం పడిపోదు.
పార్టీ నిలువునా చీలిపోతే తప్ప ఫిరాయింపుల వల్ల ప్రభుత్వాలు పడిపోవు. సంక్షోభసమయాల్లో స్పీకర్ అండదండలున్న నాయకుడే నెగ్గుకురాగలడు. యనమల రామకృష్ణుడు అలాంటి సహకారం చంద్రబాబుకి ఇచ్చి వుండకపోతే ఎన్ టి ఆర్ ప్రభుత్వం కూలిపోయేదే కాదు. స్పీకర్ పై విశ్వాసరాహిత్య తీర్మానం నోటీసు ఇచ్చిన జగన్ పార్టీకి కోడెల శివప్రసాద్ సహాయం అందే ప్రసక్తే వుండదన్న వాస్తవాన్ని జగన్ గుర్తించకపోవడం ఆశ్చర్యకరమే!
జగన్ మాదిరిగానే “నన్ను టచ్ చేస్తే తెలంగాణా ప్రభుత్వం కూలిపోతుందని నోరుజారిన చంద్రబాబు ఆతరువాత వరుస పరిణామాల కారణంగా కెసిఆర్ కు లొంగిపోయారన్న అభిప్రాయాన్ని కలిగించారు. ఫలితంగా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిన్న చావుదెబ్బ ఇపుడు అక్కడ తెలుగుదేశం పార్టీ అంతరించే దశకు చేరుకుంది. టిఆర్ఎస్ లోకి ఫిరాయించిన తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ తమదే నిజమైన తెలుగుదేశం అని స్పీకర్ కు తెలియజేయబోతున్నారు. అందుకు తెలంగాణా స్పీకర్ ఆమోదముద్రవేస్తారు. ఆ గుర్తింపును ఎన్నికల కమీషన్ కు చూపించి, తెలంగాణా పోలీసుల సహకారంతో పార్టీ ప్రధాన కార్యాలయంతో సహా ఆ రాష్ట్రంలోని తెలుగుదేశం ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకునే ఆలోచనల్లో వున్నారు.
ఒక తప్పటడుగు పాతాళానికి దింపెయ్యవచ్చు! ఒక రైట్ స్టెప్ శిఖరాన్ని ఎక్కించ వచ్చు! ఏమి జరిగినా దాన్ని సిద్ధాంతీకరించి ప్రజలతో అవుననిపించుకోవడమో లేదా ఆలోచనల్లో పడెయ్యడమో కూడా నాయకుడి లక్షణమే! “ఈ పరిణామాలు పార్టీ ఫిరాయింపులు కాదు…రాజకీయ పునరేకీకరణలే” అని సూత్రీకరించడం ద్వారా, భాష్యం చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకంటే తెలంగాణాలో కెసిఆర్ కొన్ని అడుగులు ముందుగా వున్నారు!