దాదాపుగా నాలుగు నెలల తర్వాత ప్రధాని మోడీతో జగన్ సమావేశమయ్యారు. భేటీ దాదాపుగా యాభై నిమిషాల పాటు సాగింది. మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే.. జగన్మోహన్ రెడ్డి వెంటనే అమరావతి బయలుదేరాల్సి ఉంది. కానీ అమిత్ షాతో కూడా సమావేశం కావాలని జగన్ నిర్ణయించుకోవడంతో.. అక్కడే ఉండిపోయారు. ఇక్కడే రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయం పాలైన రోజే.. జగన్కు మోదీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో.. ఇందులో రాజకీయ వ్యూహం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లో ఎవరూ లేరు. ప్రతీ రాష్ట్రానికి ఓ కేంద్రమంత్రి ఉండటం సంప్రదాయం. ఈ క్రమంలో.. వైసీపీని ఎన్డీఏలోకి తీసుకుంటారన్న ప్రచారమూ జరుగుతోంది. శివసేన ఎన్డీఏకు గుడ్ బై చెప్పడంతో.. ఆ స్థానాన్ని వైసీపీతో భర్తీ చేసుకుంటారని భావిస్తున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
మరో వైపు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అజెండాను… మండలి రద్దు విషయాన్ని ప్రధానాంశాలుగా చేసుకుని మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని స్పందన ఏమిటన్నదానిపై.. వివరాలు బయటకు తెలియడం లేదు. మోడీ సానుకూలంగా స్పందించి ఉంటే మాత్రం మాత్రం ఏపీ సర్కార్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా… కార్యాలయాల తరలింపు కోసం చేస్తున్న ప్రయత్నాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. మండలి రద్దు అంశం కూడా… ఈ తరలింపుతో ముడిపడి ఉంది. రద్దు బిల్లును పార్లమెంట్లో ఆమోదిస్తామని మోదీ హామిస్తే.. జగన్ కోరిక నెరవేరడం ఖయం.
ఇవాళ మంత్రివర్గ సమావేశంలో.. రాజధాని తరలింపునకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని జగన్ భావించినట్లుగా ప్రచారం జరిగింది. మండలిని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకు రావడమో… లేదా.. మండలిలో బిల్లులు పాసయిపోయినట్లుగా స్వయం ప్రకటన చేసి.. గవర్నర్కు పంపడమో చేయాలనుకున్నారు. కానీ.. హఠాత్తుగా ప్రధానితో భేటీ ఖరారు కావడంతో.. తాత్కలికంగా కేబినెట్ భేటీలో ఈ రాజధాని ఎజెండాను మాత్రం పక్కన పెట్టారు. మోడీ స్పందనను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జగన్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.