పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే…అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఓ హడావుడి ఉంటుంది. పార్లమెంటరీ పార్టీల భేటీలను ఆయా పార్టీల అధ్యక్షులు నిర్వహిస్తారు. పార్లమెంట్లో తమ రాష్ట్రం కోసం.. ఏం వాదన వినిపించాలో ఎజెండా డిసైడ్ చేసుకుంటారు. అది రొటీన్ . కానీ ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లకు గాను 22సీట్లను సాధించిన వైసీపీ మాత్రం ఈ రొటీన్ ప్రక్రియను పక్కన పెట్టేసింది. ఎలాంటి పార్లమెంటరీ పార్టీ భేటీని ఏర్పాటు చేయలేదు. ఎంపీలకు ఎలాంటి దిశానిర్దేశం చేయలేదు. పార్లమెంట్లో రాష్ట్రం కోసం ఏం మాట్లాడాలో కూడా చెప్పలేదు.
సోమవారం నుంచే అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నందున ఆదివారం ఎంపీలు అందరూ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆ తర్వాత కుదిరితే.. సీఎం జగన్ ఓ వీడియో కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటి వరకూ అదీ ఖరారు కాలేదు. ఏ ఎంపీ ఏం చేయాలో .. ఏం మాట్లాడారో… విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి చెబుతారని.. దానికి ప్రత్యేక సమావేశం ఎందుకన్న చర్చ వైసీపీలోనే నడుస్తోంది. ఏ ప్రశ్నలు .. ఎవరెవరు అడగాలో కూడా విజయసాయిరెడ్డి డిసైడ్ చేస్తారనే ప్రచారం ఉంది.
మరో వైపు.. సోమవారమే రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థికి మద్ధతు ఇవ్వాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆరుగురు సభ్యుల బలమున్న వైసీపీ దాదాపుగా ఎన్డీయే అభ్యర్థికి మద్ధతు ఇచ్చే అవకాశముంది. ప్రతిపక్షాల అభ్యర్థి పోటీ చేస్తున్నప్పటికీ.. బీజేపీ మిత్రపక్షాన్ని కాదనే పరిస్థితి వైసీపీకి లేదు.