కర్ణాటకలో ఇప్పుడు ఓ అంశంపై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నారు. వివాదం సృష్టిస్తున్నారు. ఆ అంశం హిజాబ్. ముస్లింలు తల, మెడను కప్పి వుంచే స్కార్ఫ్ ధరించడం సహజం. దేశంలో ఎక్కడైనా అదే పద్దతి పాటిస్తారు.అియతే కర్ణాటకలోని కుందాపుర అనే ఊళ్లో గవర్నమెంట్ కాలేజీ ఇలా హిజాబ్‌తో వచ్చిన విద్యార్థినులను అనుమతించలేదు. గేటు మూసేశారు. హిజాబ్ ధరించి కళాశాలకు వస్తే అనుమతించే ప్రసక్తే లేదని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. నిజానికి వారు మొదటి నుంచి అంతే వస్తున్నారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు వ్యక్తం చేయడంతో వివాదం ప్రారంభమయింది. సహజంగానే ఇది దేశవ్యాప్త చర్చనీయాంశం అయింది.
ఈ అంశం వెనుక రాజకీయ ఎజెండా ఉందనడానికి కొన్ని ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజికి రావడంతో, మరికొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో ఈ వివాదం అంతకంతకూ అలా పెరిగిపోతోంది. మత సంప్రదాయాలు పాటించేందుకు విద్యాసంస్థలు వేదిక కాదని హోం మంత్రి సున్నితమైన సమస్యపై అత్యంత నిర్లక్ష్యంగా ప్రటన చేసేశారు. దీంతో మరింత దుమారం రేపుతోంది. కశ్మీర్ నేతలు కూడా స్పందించారు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఇదేం పద్దతని ప్రశ్నించారు. ఈ అంశంపై కర్ణాటక హైకోర్టులో కేసు కూడా పడింది. దానిపై విచారణ జరగాల్సి ఉంది.
మరో ఏడాదిలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ అధికారంలో ఉంది . కానీ ఆ పార్టీ పరిస్థితి సరిగ్గా లేదని వరుసగా మారుస్తున్న ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాలతోనే తేలిపోతోంది. దీంతో ప్రత్యేక ఎజెండా సెట్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీల్లోనూ చొరబడుతున్న మత రాజకీయాలతో సమాజంలో వైషమ్యాలు పెరగడం తప్ప మరో ప్రయోజనం ఉండదు. కానీ రాజకీయ పార్టీలకు అవే కావాలి. అందుకే ఈ సమస్య.