Agent movie review
తెలుగు360 రేటింగ్ 1.75/5
చాలా అంచనాలతో అరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేని.. ఆ అంచనాలకు తగ్గ విజయాన్ని అయితే ఇంకా అందుకోలేదు. తొలి చిత్రంలోనే సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించిన అఖిల్.. ఆ చిత్రం నిరాశ పరచడంతో పక్కింటి కుర్రాడి పాత్రలకు మారిపోయాడు. అయితే ఇప్పుడు మరోసారి భారీ యాక్షన్ హంగామా మధ్య ‘ఏజెంట్’ గా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అఖిల్ కెరీర్ లోనే భారీ సినిమాగా రూపొందింది. ఈ సినిమా కోసం మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడ్డాడు అఖిల్. మరి ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందా? తను చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం ఏజెంట్ తో వచ్చిందా?
మాజీ ‘రా’ ఏజెంట్ ధర్మ అలియాస్ గాడ్ ( డినో మోరియా) ఒక సిండికేట్ ని ఏర్పాటు చేసి భారతదేశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటాడు. గాడ్ మిషన్ ని అడ్డుకోవడానికి డెవిల్ అలియాస్ మహదేవన్ ( మమ్ముట్టీ) రామకృష్ణ అలియాస్ ఏజెంట్ వైల్డ్ ( అఖిల్ అక్కినేని)ని మిషన్ లోకి తీసుకొస్తారు. అసలు ‘రా’ ఏజెంట్ అయిన గాడ్ దేశంపై ఎందుకు పగ పెంచుకున్నాడు? గాడ్ మిషన్ ని రామకృష్ణ ఎలా అడ్డుకున్నాడు? ఈ మిషన్ లో రామకృష్ణకి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
ముగ్గురు ‘రా’ ఏజెంట్స్ మధ్య నడిచే కథ ఇది. క్లైమాక్స్ లోని సన్నివేశాన్ని ఆరంభంలో చూపిస్తూ ఆసక్తికరంగానే కథని మొదలుపెట్టాడు దర్శకుడు. సురేందర్ రెడ్డి స్టయిల్ లో మాంచి యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నామని అనుకునేలోపలే.. హీరో పాత్రని పరిచయం చేసిన తీరు కాస్త ఆశ్చర్యంగా, వింతగా అనిపిస్తుంది. అసలు ఇలాంటి పాత్రని ఈ కథలో ఎలా ఫిట్ చేస్తారనే అనుమానం రేగుతుంది. ఇలాంటి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని భావించారేమో కానీ ఏజెంట్ కథకు హీరో పాత్రని తీర్చిదిద్దిన విధానమే పెద్ద బలహీనతైపోయింది.
హీరో పరిచయం, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు చాలా వరకూ లాజిక్ లెస్, మీనింగ్ లెస్ గా వుంటాయి. చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ అవ్వాలని కలలు కనడం, వివిధ భాషలు నేర్చుకోవడం, సొంతగా ఒక నెట్ వర్క్ పెట్టుకోవడం.. ఇక్కడి వరకూ ఓకే. కానీ ‘రా’ రాత పరీక్షలో నాకు ఫలానా చోట పోస్టింగ్ ఇప్పించండని పేపర్ పై రాయడం అతి కి పరాకాష్ట. ఈ అతి తెలివి ప్రదర్శన అక్కడితో ఆగదు. ఏకంగా రా నెట్ వర్క్ నే హ్యాక్ చేస్తాడు సదరు హీరో. ఇదంతా ఎందుకంటే రా ఛీఫ్ మహదేవన్ ద్రుష్టిలో పడటానికి. మరి ఇన్ని తెలివితేటలు వున్నపుడు.. మొదటే ఈ పని చేయొచ్చు కదా అనిపించి ముందు వేసుకున్న సీన్లు అన్నీ టైం పాస్ కే అనే ఫీలింగ్ స్వయంగా కలిగిస్తారు.
ఇక ఏజెంట్ ప్రేమకథ కూడా కుత్రిమంగానే తయారైయింది. హీరోయిన్ చూస్తే హీరో లో ఫీలింగ్స్ కలుగుతాయి. డైరెక్ట్ గా పిల్లల్నికందామని హీరో అడగడం, నాలుగు రోజులు కలసి తిరుగుదాం, నాకూ ఫీలింగ్స్ కలిగితే అప్పుడు చూద్దాం లే అని హీరోయిన్ చెప్పడం.. ఇదంతా తెరపై చూస్తున్నపుడు.. నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. నిజానికి ఇలాంటి కథల్లో లవ్ ట్రాక్ ని ఇరికించడం కుదరదు. అయితే సురేందర్ రెడ్డి హీరోయిన్ పాత్రని కథలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించేశారు. ఒక మంత్రి, అతని కొడుకు కలసి హీరోయిన్ ని అల్లరి చేయడం, దాంతో రగిలిపోయిన హీరో.. వాళ్ళకి వైల్డ్ వార్నింగ్ ఇవ్వడం.. ఈ ట్రాక్ అంతా సగటు కమర్షియల్ సినిమా ట్రాకులా సాగుతుంది.
అయితే ఈ ట్రాక్ తో జరిగిన మేలు ఒకటి వుంది. ఏజెంట్ ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గ సన్నివేశం ఏదైనా ఉందా అంటే.. మంత్రిగారి ఇంటికి వెళ్లి హీరో వార్నింగ్ ఇవ్వడం. సగటు ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే.. అఖిల్ ని అభిమానించే ఫ్యాన్స్ కి ఈ సన్నివేశం నచ్చుతుంది. హీరో పాత్రని వైల్డ్ గా చూపించే క్రమంలో చాలా సాగదీశాడు దర్శకుడు. ఇంటర్వెల్ కి ముందగానీ హీరో మిషన్ లోకి రాడు. మిషన్ లోకి వచ్చిన తర్వాత భారీ యాక్షన్ సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ని ప్లాన్ చేశారు. కానీ ఈ బ్లాక్ లో ఎమోషన్ లేదు. ఆ యాక్షన్ బ్లాక్ కథలో కుదరలేదు. ఆ బ్లాక్ లో దాదాపు అరవైముందిని చంపుతాడు హీరో. చంపడానికి హీరో దగ్గర ఒక కారణం ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ చంపాలనే ఎమోషన్ ప్రేక్షకుల్లో కూడా కలిగినప్పుడే యాక్షన్ వర్క్ అవుట్ అవుతుంది. కానీ ఏజంట్ లో అది కనిపించదు. చిన్నపిల్లలు తుపాకులతో వీడియో గేమ్స్ ఆడుకున్నట్లు కాలుస్తూనే ఉంటాడు హీరో. ఆ తుపాకుల శబ్దం చెవికి చిరాకుపెట్టడం తప్పితే మరో ఎఫెక్ట్ ఇవ్వదు.
ఫస్ట్ హాఫ్ వరకూ కథని ఎదోలా లాక్కొచ్చిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ లో సైడ్ ట్రాక్ పట్టించేస్తాడు. విలన్ బ్యాచ్ అఖిల్ కోసం వెతకడం, పట్టుకొని టార్చర్ పెట్టడం, విలన్ తో చేతులు కలిపిన హీరో అతడికి నమ్మకస్తుడిగా మారడం.. ఈ డ్రామా అంతా తేలిపోతుంది. స్పై కథలో వచ్చే మలుపులు ఆసక్తికంగా వుండాలి. ఏజెంట్ అసలు మలపులే కరువయ్యాయి. విలన్ కి ఒక నేపధ్యం వుంటుంది. హీరో కి మరో నేపధ్యం వుంటుంది. ఈ రెండూ కూడా అసలు కథతో సంబంధం లేకుండా విడిగా కనిపిస్తాయి. ఈ కథలో మిషన్ రాబిట్ అనేది కీలకం. ఆ మిషన్ ని హీరో ఆపాలి. దాన్ని ఆపాలనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలిగించాలి. ఈ విషయంలో దర్శకుడు దారుణంగా విఫలమయ్యాడు. అసలు ఆ మిషన్ ఏమిటో సరిగ్గా ప్రజంట్ చేయలేకపోయారు. మహదేవన్ పాత్రకి ఇచ్చిన ముగింపు కూడా అర్ధరహితంగా వుంటుంది. ఇలాంటి కథలకు చివర్లో డైలాగులు అనవసరం. విచిత్రంగా సురేందర్ రెడ్డి పేజీల కొద్ది డైలాగులు రాయించారు. మూడు ప్రధాన పాత్రలు చివర్లో తీరిగ్గా డైలాగులు చెబుతూ సహనానికి పరీక్షపెడతాయి.
అఖిల్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తన లుక్ మార్చుకున్నాడు. తెరపై ఆ కష్టం కనిపిస్తుంది. అయితే ఈ పాత్ర అఖిల్ కి సరిగ్గా నప్పలేదు. తన శక్తిమేరకు ప్రత్నించాడు కానీ పాత్రని తీర్చిదిద్దిన విధానంలోనే లోపాలు వున్నాయి. పాత్రలో ఎమోషన్ కనెక్షన్ వుండదు. యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. రామా కృష్ణా పాటలో డ్యాన్స్ ఓకే అనిపిస్తుంది. ఏజంట్ లో మహదేవన్ గా కనిపించిన మమ్ముట్టి మరోసారి తన అనుభవాన్ని చూపించారు. చాలా హుందాగా చేశారు. ఆ పాత్రకు మమ్ముట్టి మంచి ఛాయిస్. ‘రా‘లో ఆయన ప్రజన్స్ సీరియస్ నెస్ ని తీసుకొచ్చింది. విక్రమ్ లో కమల్ హాసన్ తరహాలో ఓ మిషన్ గన్ ని కూడా పేల్చారాయన. అఖిల్, మమ్ముట్టిని భుజాలపై ఎత్తుకొని చేసిన ఫైట్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. గాడ్ గా చేసిన డినో మొరియో విలనీ లుక్ బావుంది. చాలా తెలివైన ఏజెంట్ తను. అయితే ఆ పాత్రని కేవలం మాటలకే పరిమితం చేసినట్లుగా అనిపించింది. సాక్షి వైద్య అందంగా కనిపించింది. మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళీ, సంపత్.. పరిధిమేర కనిపించారు. అన్నట్టు ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ వుంది. నటన మాట పక్కనే పెడితే ఆమెకు ఏం చెప్పి ఆ పాత్రకి ఒప్పించుంటారనేది ఆసక్తికరం.
టెక్నికల్ గా ఏజెంట్ డీసెంట్ గా వుంటుంది. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. చివర్లో యాడ్ చేసిన పాట కథాగమనానికి అడ్డుతగిలింది. నేపధ్య సంగీతం ఇంకా ప్రభావంతంగా ఉండాల్సింది. కెమరాపనితనం బావుంది. లావిష్ లోకేషన్స్ లో తీశారు. ఎడిటర్ ఆ చివరి పాటతో పాటు సెకండ్ హాఫ్ లో కట్ చేసేయల్సిన స్టఫ్ చాలా వుంది. నిర్మాణం విలువలు ఓకే అనిపిస్తాయి. గుర్తుపెట్టుకునే మాటలు అయితే లేవు. హీరో పాత్రతో నేల విడిచిసాము చేశారు సురేందర్ రెడ్డి. అడుగడుగునా వైల్డ్.. అన్ ప్రిడిక్టబుల్‌గా అంటూనే .. ఓల్డ్, ప్రెడిక్టబుల్ ఏజెంట్ ని అందించారు
ఫినిషింగ్ టచ్: అయ్యగారి కష్టం వృథా
తెలుగు360 రేటింగ్ 1.75/5