అఘోరి పేరుతో ఓ ట్రాన్స్ జెండర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు. మీడియా అంతా ఆ అఘోరి అని పేరు పెట్టుకున్న ఆమె చుట్టూ తిరుగుతోంది. పేరుకు ట్రాన్స్ జెండర్.. అఘోరినే కానీ.. మీడియా ఎంత గొర్రెతనంతో వ్యవహరిస్తుందో నిరూపించడానికి కావాల్సినన్ని తెలివితేటలు ఉన్నాయి. ఎలా అటెన్షన్ తెచ్చుకోవాలో అలా తెచ్చుకుంటూ మీడియాను వాడేసుకుంటూ వారిపైనే దాడులు చేస్తూ ఆ అఘోరి చేస్తున్న ఓవరాక్షన్ చూసి.. ముందు ఈ మీడియాకు సిగ్గులేదా అని జనం అనుకునే పరిస్థితికి వచ్చింది.
పక్కా ప్లాన్ తోనే అఘోరి వేషంలో రంగంలోకి దిగింది ఆ ట్రాన్స్ జెండర్. ఎలా చేస్తే మీడియా తన వెంట పడుతుందో అర్థం చేసుకుంది. అందుకే ఎప్పటికప్పుడు ఓ సారి ఆత్మార్పణం అంటారు.. మరో సారి పవన్ కల్యాణ్ అంటారు… ఇంకో సారి సీఎంకు కష్టాలు అంటారు. అసలు ఎవరు ఈ అఘోరి అనే ఆలోచించే సమయం లేకుండా మీడియాలో వచ్చే పబ్లిసిటీతో కొత్త దేవుడిగా మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడు ఎక్కడ తిరుగుతారో తెలియదు కానీ.. మీడియాలో పబ్లిసిటీ రావడానికి ఏం చేయాలో అది చేస్తున్నారు.
ఇలాంటి వారికి పబ్లిసిటీ ఇచ్చి మీడియా అంటే ప్రజల్లో జాలి కలిగేలా చేయడానికి కొంత మంది ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. తెలంగాణకు వెళ్లి అక్కడ రేవంత్ కు కష్టాలు అంటారు… పవన్ కల్యాణ్ ఆఫీసు ముందుకు వచ్చి ధర్నా చేస్తారు. ఎవరనా అఘోరిలో ఇలా చేస్తారా ?. వరుసగా ఆలయాలు తిరుగుతూ.. రచ్చ చేయడం .. ప్రజల దృష్టిలో పడేందుకు అవసరమైన మీడియా వెంట పడుతూండటంతో ఆడిందే ఆటగా మారింది. ఇప్పుడు అ అఘోరీకి కాళ్లకు దండాలు పెట్టేవారు కూడా తయారయ్యారు. ఈ అజ్ఞానం పంచిన పాపం .. ఎవరిది ?