తెలుగు చిత్రసీమలో పరాయి భామల హవాఎక్కువ. టాప్ 5లో వాళ్లే ఉంటారు. తెలుగు అమ్మాయిలు అరా కొర వచ్చినా – స్టార్ హీరోయిన్లు కాలేకపోయారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చారుకాబట్టి, వాళ్లకు మరొకరి చేత డబ్బింగ్ చెప్పించుకోవాల్సి వస్తుంటుంది. అయితే ఇప్పుడు కథానాయికల ఆలోచన మారింది. తమ సొంత గొంతు వినిపించడానికి ఉవ్వీళ్లూరుతున్నారు. కాకపోతే.. దర్శకుడు ‘ఓకే’ అనాలి. ‘మేం డబ్బింగ్ చెప్పుకొంటాం’ అని హీరోయిన్లు అంటున్నా – అంత రిస్క్ తీసుకోవడానికి డైరెక్టర్లు సిద్ధంగా లేరు. దానికి కారణం లేకపోలేదు. తెలుగు రానివాళ్లతో.. పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడించాంలంటే చాలా కష్టం. వాళ్లతో డబ్బింగ్ చెప్పించాలంటే ఇంకా కష్టం. కేవలం డబ్బింగ్ కే 15 రోజులు కేటాయించాల్సివస్తుంది. అంత టైమ్ ఉండదు. పైగా గొంతు సూట్ కాలేకపోతే… ఆ పాత్రల్ని రిసీవ్ చేసుకోలేరు. అందుకే.. హీరోయిన్లు డబ్బింగ్ చెబుతామంటే, దర్శకులు లైట్ తీసుకొంటారు.
అయితే త్రివిక్రమ్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. తెలుగు భాషపై ఆయనకు అభిమానం ఎక్కువ. ఆయన డైలాగుల్లో పాసలు, పంచ్‌లే కాదు… ఘాఢత కూడా ఉంటుంది. అలాంటి డైలాగుల్ని పీల్ అయి, పలకాలి. అప్పుడే… డైలాగ్‌కి పరిపూర్ణమైన అందం వస్తుంది. అందుకే… ‘అజ్ఞాతవాసి’ కోసం.. కథానాయికలిద్దరితోనూ డబ్బింగ్ చెప్పించాడు త్రివిక్రమ్. మొన్న కీర్తి సురేష్ తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు అను ఇమ్మానియేల్ వంతు వచ్చింది. అను కూడా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పింది. ఈ క్రెడిట్ పూర్తిగా త్రివిక్రమ్‌దే. ‘ఈ సినిమాలో మీ గొంతులే వినిపించాలి’ అని క్లారిటీగా చెప్పేశాడట. డబ్బింగ్ సమయంలో దగ్గరుండి కేర్ తీసుకున్నాడట. అను, కీర్తిలు ఇద్దరికీ చెరో తెలుగు ట్యూటర్ని అప్పజెప్పి, పదాలకు అర్థాలు చెప్పి, తెలుగు భాషపై పట్టు వచ్చేలా చేశాడట త్రివిక్రమ్. అందుకే కీర్తి, అనులు ధైర్యం చేసి గొంతు విప్పారు. ఈమాత్రం కాన్ఫిడెన్స్ అందిస్తే…మిగిలిన కథానాయికలూ… ఇదే దారిలో నడవడం ఖాయం.