త్రివిక్రమ్‌పై హాలీవుడ్ సినిమాల ప్రభావం అంతా ఇంతా కాదు. అతని సూపర్ హిట్ సినిమాలు అతడు, జులాయి హాలీవుడ్ కథలకు ట్రూ కాపీ. అ.ఆ ఓ నవలకు స్ఫూర్తి. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో తెరకెక్కిస్తున్న అజ్ఞాత వాసి కూడా హాలీవుడ్ సినిమాకి కాపీనే అని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. 2011లో వచ్చిన ది హెయిర్ అప్పారెంట్ అనే సినిమా నుంచి త్రివిక్రమ్ స్ఫూర్తి పొందాడని – అదే అజ్ఞాతవాసి కథ అని పరిశ్రమ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖష్బూ విలన్ పాత్రలో కనిపించనున్నదని మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది ఏ హాలీవుడ్ సినిమాకీ స్ఫూర్తి కాదని తెలుస్తోంది. త్రివిక్రమ్ పూర్తిగా తన సొంత తెలివితేటలతో రాసిన కథ అనీ, ఆ కథ కూడా చాలా సింపుల్‌గా ఉంటుందనీ, ట్విస్టులూ.. టర్నింగ్ పాయింట్లూ ఏమీ ఉండవని – సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కథ మొత్తం తెలిసిపోతుందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
అయితే సింపుల్ కథని.. తన స్ర్కీన్ ప్లే చాకచక్యంతో త్రివిక్రమ్ నడిపించాడట. డైలాగులు మరో స్థాయిలో ఉంటాయని, పవన్ కల్యాణ్ పెర్‌ఫార్మ్సెన్స్ ది బెస్ట్.. అని రిపోర్ట్ వస్తోంది. ఎమోషన్స్, వినోదం.. అత్తారింటికి దారేది ని మించిపోయాయని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి అజ్ఞాతవాసి విడుదల కాబోతోంది. ఇప్పటికే ఓ పాట విడుదల చేశారు. 12న మరో పాట బయటకు వస్తుంది. సీతారామశాస్త్రి రాసిన ఈ గీతం… ఆల్బమ్ కే హైలెట్‌గా నిలవబోతోందని సమాచారం.