Agnyaathavaasi Audio Launch highlights
పవన్ విశ్వరూపం చూస్తారు : త్రివిక్రమ్
పవన్ కల్యాణ్‌ని ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో త్రివిక్రమ్ కంటే ఎవ్వరికీ బాగా తెలీదేమో. ఎందుకంటే ఆయనా ఓ పవన్ అభిమానే. జల్సాలో పవన్ ని కొత్తగా చూపించారు. అత్తారింటికి దారేదిలో మరింత అందంగా మార్చారు. అజ్ఞాతవాసిలో ఇంకాస్త స్టైలీష్ గా చేసేశారు. ఈ సినిమాలో పవన్ విశ్వరూపం చూడడం ఖాయమని ఓ అభిమానిగా అభిమానులకు మాట ఇచ్చాడు త్రివిక్రమ్.
త్రివిక్రమ్ స్పీచ్‌లు ఎప్పుడూ అందంగా, అద్భుతంగా ఉంటాయి. ఈసారి ఆ పవర్ కాస్త తగ్గినా – శ్రోతల్ని తనదైన శైలిలో ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు త్రివిక్రమ్. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే మాటతో ఆయన స్పీచ్ మొదలైంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ల గొప్పదనం వివరిస్తూ. వాళ్ల నుంచి తాను ఏం నేర్చుకున్నాడో చెప్పుకొచ్చిన విధానం బాగా బాగుంది. పవన్ అంటే ప్రత్యేక ప్రేమ కదా, ఆ ఇష్టం మరోసారి ఆయన మాటల్లో బయటపడింది.
ఓ స్టార్ హీరోకి, అందునా పవన్ లాంటి వాడికి కథ చెప్పి ఒప్పించడం కష్టం. కాకపోతే ఇక్కడున్నది త్రివిక్రమ్ కదా. అందుకే జస్ట్ ఫోన్ లో రెండే రెండు నిమిషాల్లో పవన్‌ని కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట త్రివిక్రమ్. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. పవన్‌తో మళ్లీ మళ్లీ పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని, అభిమానులు కోరుకుంటున్నా ఉన్నతమైన స్థాయికి పవన్ చేరాలని ఆయన కోరుకున్నారు.
ఆ సమయంలో నాకు అండగా నిలబడిన వ్యక్తి త్రివిక్రమ్: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ ల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ కృష్ణార్జునులు. పవన్ సినిమా అంటే అది త్రివిక్రమ్ సినిమానే. త్రివిక్రమ్ సినిమా అంటే అది పవన్ సినిమానే. ఖుషి తరవాత సరైన హిట్ పడక.. సతమతమవుతున్న పవన్ కెరీర్‌కి జల్సాతో ఊపు తెచ్చాడు త్రివిక్రమ్. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య మైత్రి బలపడుతూ వస్తోంది. ఇప్పుడు వీరిద్దరి నుంచి వస్తున్న సినిమా `అజ్ఞాతవాసి`. సినిమాలు లేకపోయినా.. ఇద్దరూ ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. పవన్ ప్రసంగాలన్నీ త్రివిక్రమ్ రాసి ఇస్తాడని, త్రివిక్రమ్ ని పవన్ గైడ్ చేస్తాడని బయట చెప్పుకుంటుంటారు. వాటిపై పవన్ తొలి సారి స్పందించాడు. అజ్ఞాత వాసి ఆడియో ఫంక్షన్ లో పవన్ మాట్లాడుతూ త్రివిక్రమ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
”మేమిద్దరం మధ్యతరగతి నుంచి వచ్చాం. మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. నేను త్రివిక్రమ్ ని గైడ్ చేయడం ఏమిటి? అతని గోల్డ్ మెడలిస్ట్. మంచి రచయిత. దర్శకుడు. నేను కాకపోతే మందమంది హీరోలు దొరకుతుతారు. మేం ఒకేలా ఆలోచిస్తాం. అందుకే ఇంత బాగా కలిసిపోయాం. నేనెప్పుడూ ఇంట్లోవాళ్లపై కోప్పడను. అలాంటిది త్రివిక్రమ్‌పై కోప్పడగలను. ఆ చనువు మా ఇద్దరి మధ్యా ఉంది. జల్సా షూటింగ్లో కామెడీ సీన్లు చేస్తున్నప్పుడు కూడా నేను హుషారుగా ఉండేవాడ్ని కాదు. ప్రపంచంలోని బాధలన్నీ నా బాధలే అంటూ సతమతమవుతుండేవాడ్ని. అలాంటి సమయంలో తన కవితలతో, మాటలతో నాలో ఉత్సాహం నింపాడు త్రివిక్రమ్. ఆ సమయంలో నాకు అండగా నిలబడ్డాడు. సినిమాలు చేయాలి. మీరు బయటకు రావాలంటూ ఉత్సాహపరిచాడు. ఓ అభిమాని దర్శకుడిగా మారితే ఎలా ఉంటుందో త్రివిక్రమ్‌ని చూస్తే తెలుస్తుంది” అంటూ త్రివిక్రమ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు పవన్.
ఈ సందర్భంలో కెరీర్ సాగిన విధానాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. పది, పన్నెండు సినిమాలు చేసి వెళ్లిపోవాలనుకున్నానని, అభిమానులే పాతిక సినిమాల వరకూ తీసుకొచ్చారని, క్లిష్టసమయంలో సన్నిహితులెవరూ తన పక్కన లేరని, కేవలం అభిమానులే ఉన్నారని, తాను మళ్లీ సినిమాలు చేయడానికి కారణం అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహమే అని చెప్పుకొచ్చాడు పవన్. దేశానికి తన వంతు ఉడతాభక్తి సేవ చేయడానికి చిత్రసీమ తనకు ఓ వేదిక ఇచ్చిందని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తప్పకుండా దేశానికి, సమాజానికి సేవ చేస్తానని మాట ఇచ్చాడు ఈ జనసేనాని.
డిసెంబరు 31న… పవన్ కానుక
అజ్ఞాత వాసిలో 5 పాటలున్నాయి. ఆడియో సీడీ బయటకు రాకముందే మూడు పాటలొచ్చాయి. ఇప్పడు మరో రెండు పాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో మరో పాట కూడా ఉంది. దాన్ని సర్ప్రైజ్ గా దాచి పెట్టింది చిత్రబృందం. ఆ పాటని డిసెంబరు 31న విడుదల చేయబోతోంది. పవన్ ఆలపించిన ఈ పాటని జనవరి 1 కానుకగా అందిస్తున్నారన్నమాట. అత్తారింటికి దారేదిలోనూ ఇదే ఫార్ములా పాటించాడు త్రివిక్రమ్. కాటమరాయుడా గీతాన్ని… ఆడియో ఆల్బమ్‌లో పొందు పరచలేదు. దాన్ని దాచి పెట్టి… ఆడియో అయిపోయిన తరవాత ప్రత్యేకంగా వీడియో రూపంలో విడుదల చేశారు. అప్పట్లో యూ ట్యూబ్‌ని షేక్ చేసి పాడేసింది ఆ గీతం. ఇప్పుడూ అదే ట్రెండ్‌లో వెళ్తోంది అజ్ఞాతవాసి టీమ్. మరి ఈ పాట ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
జురాసిక్ పార్క్ చూపించిన పవన్ : ఆది
ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ కీలక పాత్ర పోషించాడు. పవన్ పక్కన నటించడం ఓ అదృష్టమని పొంగిపోతున్నాడు ఆది. సినిమాల్లోకి రాకముందే పవన్ గురించి తనకు తెలుసట. ఓసారి ఆది ఇంటికి వెళ్లాడట పవన్. అప్పుడే వాళ్లింట్లో సీడీ ప్లేయర్ కొత్తగా వచ్చిందట. దాన్ని ఎలా ఆన్ చేయాలో తెలీక తికమక పడుతుంటే. పవన్ అరగంట పాటు కష్టపడి, దాన్ని సెట్ చేసి వెళ్లాడట. పవన్ వెళ్లాక ఆ ఇంట్లో వాళ్లంతా జురాసిక్ పార్క్ సినిమా చూశార్ట. అప్పటి నుంచీ పవన్ అభిమానిని అయిపోయా అంటున్నాడు ఆది. పవన్ సినిమాల షూటింగ్ దూరం నుంచి చూసినా చాలు అనుకొనేవాడినని, అలాంటిది పవన్‌తో కలసి నటించే అవకాశం వస్తుందని ఊహించలేదని, ఈ సినిమాలో పవన్ ఇంకా కుర్రాడిలా, స్టైలీష్‌గా కనిపించబోతున్నాడని చెప్పుకొచ్చాడు ఆది.
ఆఫ్ స్క్రీన్‌లోనూ పవన్‌కి ఫ్యాన్ అయిపోయా: కీర్తి సురేష్
నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో ఆకట్టుకున్న – కీర్తి సురేష్ అనతి కాలంలోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్‌తో కలసి నటించే ఛాన్స్ అందుకుంది. పవన్‌తో సినిమా అంటే ఆ ఆనందం మామూలుగా ఉంటుంది. వేరే రేంజులో కనిపిస్తుంది. కీర్తి మాటల్లోనూ అదే వ్యక్తం అయ్యింది. త్రివిక్రమ్ చాలా కూల్ డైరెక్టర్. అతని తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పిన కీర్తి… సంగీత దర్శకుడు అనిరుధ్‌ని పెన్సిల్‌తో పోల్చింది. చూడ్డానికి పెన్సిల్లా ఉండే అనిరుధ్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తాడని… కితాబులు ఇచ్చింది. పవన్ కి అయితే కీర్తి ఫ్యాన్ అయిపోయిందట. ఇప్పటి వరకూ తెరపై కనిపించే పవన్‌కి ఫ్యాన్‌ని. ఈ సినిమా చేశాక.. ఆఫ్ స్ర్కీన్‌లోనూ పవన్‌కి అభిమానిగా మారిపోయా… అని చెప్పింది కీర్తి సురేష్. సేమ్ టూ సేమ్… అను ఇమ్మానియేల్దీ అదే మాట. పవన్ పక్కన నిలబడడమే గొప్ప అనుకొనేదట అను. అలాంటిది పవన్ పక్కన నటించే ఛాన్స్ దక్కిందని మురిసిపోయింది. త్రివిక్రమ్‌తో మళ్లీ మళ్లీ కలసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా అని చెప్పింది అను ఇమ్మానియేల్.
చిరుని గుర్తు చేసిన ఖుష్బూ
అజ్ఞాతవాసి ఆడియో కార్యక్రమం అంతా పవన్ కల్యాణ్ నామ జపంలానే సాగుతోంది. మైకు పట్టుకున్న వాళ్లంతా పవన్ నో, త్రివిక్రమ్ నో పొగిడేయంలో బిజీగా ఉన్నారు. అయితే… ఖుష్బూ మాత్రం చిరంజీవిని గుర్తు చేసింది. ఈ సినిమాలో ఖుష్బూ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె తన స్పీచ్‌లో చిరంజీవి పేరు ప్రస్తావించడంతో ఆడిటోరియం హోరెత్తింది. పదేళ్ల క్రితం చిరంజీవితో కలసి స్టాలిన్‌లో నటించానని, ఆ తరవాత తెలుగులో ఓ సినిమా చేయడం ఇదే తొలిసారి అని చెప్పింది. ఈమధ్య కాలంలో తనకు చాలా అవకాశాలొచ్చాయని, అయితే దేనికీ ఒప్పుకోలేదని, ఓమంచి పాత్ర కోసం ఇన్నాళ్లు ఎదురు చూశానని, అది అజ్ఞాతవాసితో దక్కిందని చెప్పింది ఖుష్బూ. తాను కూడా పవన్ సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయిందట. ఓ సూపర్ స్టార్ ఇంత వినయంగా ఉండడం చూడలేదని కితాబిచ్చింది. స్పీచుల మధ్యలో అనిరుధ్ తన పెర్ఫార్మ్సెన్స్తో ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలోని పాటల్ని.. ఆలపిస్తూ, చిందులు వేస్తూ.. ఫ్యాన్స్‌కి హుషారు తెప్పిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో శాండిల్ ఆర్ట్‌తో ఓ షో చేశారు. మొదట్లో అది కాస్త ఆసక్తికరంగానే ఉన్నా.. లెంగ్త్ పెరిగిపోవడంతో బోర్ కొట్టినట్టైంది. అది మినహాయిస్తే.. అజ్ఞాతవాసి కార్యక్రమం హుషారుగానే సాగుతోంది.
అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరుగుతోంది. వేదికపై వక్తలంతా పవన్ కల్యాణ్‌ని పొగిడే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. కవి, రచయిత, దర్శకుడు, నటుడు తనికెళ్ల భరణి అయితే.. పవన్ కోసం ఓ కవితే రాసుకొచ్చారు.
అతడొక మితభాషి
నిత్య సత్యాన్వేషి
అర్జునిడి వంటి ఓ అజ్ఞాతవాసి
అంటూ పవన్ గురించి మూడు ముక్కల్లో కవిత్వం చెప్పి అభిమానుల్ని మెప్పించాడు.
బద్రి సమయంలో ఒక్క పోస్టర్ కూడా వేయలేదని, ఆడియో కూడా రిలీజ్ చేయలేదని, అలాంటిది సినిమా విడుదలై బ్లాక్ బ్లస్టర్ హిట్ అయ్యిందని, ఈ సినిమాకి ఇంత ప్రచారం చేస్తున్నారు కాబట్టి.. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని, 2018లో తొలి బ్లాక్ బ్లస్టర్ అజ్ఞాతవాసి అని… దిల్ రాజు జోస్యం చెప్పారు. బాలీవుడ్ దర్శక దిగ్గజం రాజ్ హిరాణీతో త్రివిక్రమ్‌ని పోల్చాడు దిల్‌రాజు. ఆయనంత స్టామినా ఉన్న సినిమాల్ని త్రివిక్రమ్ తీయగలడని, అత్తారింటికి దారేదితో అది రుజువైందని, ఇప్పుడు అజ్ఞాతవాసి కూడా ఆ జాబితాలో చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు దిల్‌రాజు.
ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బొమన్ ఇరానీ కూడా కిక్ ఎక్కించే స్పీచే ఇచ్చాడు. అత్తారింటికి దారేది గొప్ప అనుభూతి ఇచ్చిందని, ఈ సినిమాలో అవకాశం రాగానే… కథేంటి? పాత్రేమిటి? పారితోషికం ఎంత అనే ప్రశ్నలేం వేయకుండా సినిమా ఒప్పుకున్నానని దానికి కారణం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అని చెప్పుకొచ్చాడు బొమన్.