హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరట లభించింది. ఆ సంస్థ ఆస్తుల వేలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఆర్థికశాస్త్ర నిపుణుడు నర్సింహమూర్తి నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఆర్థిక నేరాల అధ్యయనకమిటీ మూడునెలల్లో డిపాజిటర్లకు చెల్లింపులు జరుపుతామని ఇవాళ ప్రకటించింది. సంస్థ మొత్తం ఆస్తుల విలువ 7 వేల కోట్లని నర్సింహమూర్తి వెల్లడించారు. సంస్థలో మొత్తం 32 లక్షలమంది డిపాజిటర్లు ఉన్నారని, అప్పుల విలువ రు.6,800 కోట్లని తెలిపారు. ముందుగా 5,300మంది డిపాజిటర్లకు చెల్లింపులు చేస్తామని వెల్లడించారు. న్యాయపరమైన అనుమతి లభించగానే ఇ-వేలం ద్వారా ఆస్తులను అమ్ముతామని తెలిపారు. క్యాష్ మేనేజ్మెంట్పై అవగాహనలేక సంస్థ దివాళా తీసిందని నర్సింహమూర్తి చెప్పారు. అప్పులకంటే ఆస్తుల విలువ ఎక్కువ ఉంది కాబట్టి డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు.
అగ్రిగోల్డ్ సంస్థ ఒక సమయంలో మంచి వెలుగు వెలిగింది అయితే అత్యుత్సాహంతో టీవీ ఛానల్(టాలీవుడ్ టీవీ), ఎమ్యూజ్మెంట్ పార్క్(హాయ్‌ల్యాండ్)వంటి ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టటంతో నష్టాల పాలయ్యింది. డిపాజిట్లు మెచ్యూర్ అయినా చెల్లింపులు చేయకపోవటంతో కొందరు డిపాజిటర్లు, డిపాజిటర్ల ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఏజెంట్లు ఆత్మహత్యలుకూడా చేసుకున్నారు.