ఏపీలో ‘మూడు రాజధానులు’ రచ్చ జోరుగా సాగుతున్న దృశ్యం చూస్తున్నాం కదా. ముఖ్యమంత్రి జగన్ ఆల్రెడీ రాజధానిని మూడుగా విభజించారు. మూడు రాజధానులు ఇంకా అధికారికంగా అమల్లోకి రాకపోయినా అనధికారికంగా పనైపోయింది. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చాక ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. అమరావతిలో రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో తాజాగా తెర మీదికి మరో రాజధాని వచ్చింది. ఇప్పటికే అమరాతిని లెజిస్లేచర్ కేపిటల్‌గా చెబుతున్నారు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా చెబుతున్నారు. కర్నూలును జ్యుడీషియల్ కేపిటల్‌గా ప్రచారం చేస్తున్నారు. మూడూ సరిపోయాయి కదా. ఇంకా ఏం మిగిలింది విభజించడానికి? అనే ప్రశ్న వస్తోంది.
నిజమే…మరో రాజధానిగా చేయడానికి ఇంకా ఏం మిగల్లేదు. అనుకున్న ప్రకారం విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అయిపోతే అదే నిజమైన రాజధాని అవుతుంది. పరిపాలన ఎక్కడి నుంచి కొనసాగితే, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుంది. అసెంబ్లీ ఉన్నంతమాత్రాన అమరావతి రాజధాని కాదు. అమరావతి ప్రాంతమున్న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల్లో ఇప్పటికే ఉన్న అసంతృప్తి, ఆక్రోశం మరింత పెరుగుతాయి. మరి వారిని ఉపశమింపచేయాలి కదా. అందుకే ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదే…నాలుగో రాజధాని. అదే…వ్యవసాయ రాజధాని. ఇది విజయవాడ కేంద్రంగా ఏర్పాటవుతుందని తెలుస్తోంది. వాస్తవానికి ఇది అగ్రికల్చర్ సెజ్. ఇదే రాష్ట్రానికంతటికీ ప్రాతినిధ్యం వహించే వ్యవసాయ రాజధాని. విజయవాడను వ్యవసాయ రాజధానిగా ప్రకటించడానికి ముఖ్యమంత్రి జగన్ గ్రౌండ్ ప్రిపేర్ సిద్ధం చేశారట…!
అంతర్జాతీయ ప్రమాణాలతో ఇది ఏర్పాటవుతుంది. మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ప్లాన్-ఎ అనుకుంటే, వ్యవసాయ రాజధాని ప్లాన్-బి అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించేవి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు. వ్యవసాయ ఉత్పత్తుల్లో సింహభాగం ఈ జిల్లాలదే. అయితే వ్యవసాయ రంగానికి సంబంధించి మౌలిక వసతులు లేకపోవడంవల్ల, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి తగిన సౌకర్యాలు, ప్రోత్సాహం లేకపోవడంవల్ల ఈ జిల్లాల రైతాంగానికి తగిన గిట్టుబాటు ధరలు, ఆదాయం రావడంలేదు. అమరాతిలో రాజధాని నగర నిర్మాణానికి భారీగా డబ్బు ఖర్చు చేయడంకంటే మూడు రాజధానులు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ సెజ్‌ను ఏర్పాటు చేస్తే వ్యవసాయ రంగానికి ఊపు వస్తుందని, రైతులకు అన్నివిధాల ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేశారని సమాచారం.
అన్ని సౌకర్యాలతో కూడిన అంటే కోల్డ్ స్టోరేజీలు, ట్రేడింగ్ కేంద్రాలు, రవాణా సౌకర్యాలు, ఎక్స్‌పోర్టు హబ్‌లు, ఇంకా అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నారు. సెజ్ కారణంగా రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పతులు పండించి, ఎగుమతి చేస్తే భారీగా ఆదాయం వస్తుందని కీలక అధికారులు చెప్పారు. వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న జిల్లాలకు నౌకాశ్రయాలు (పోర్టులు) దగ్గరగా అందుబాటులో ఉన్నందున రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. అమరావతి నిర్మాణం కంటే వ్యవసాయ రాజధాని వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, దీని ద్వారానే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.
జగన్ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి వ్యవసాయ రంగాన్ని పరిశీలించారు. అక్కడి సాగు విధానాలు, పంట ఉత్పత్తులు, మార్కెటింగ్ సౌకర్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల తీరు మొదలైనవి పరిశీలించారు. దీంతో ఆయన వ్యవసాయ సెజ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. హైపవర్ కమిటీ నివేదిక తరువాత వ్యవసాయ రాజధానిని ప్రకటించవచ్చని సమాచారం. ప్రజలపై ఈ రాజధాని ఎలాంటి ప్రభావం చూపిస్తుందో…! ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో…!