హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థకు శ్రీకారం జరిగింది. గుంటూరు జిల్లాలోని లాం ఫామ్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. తర్వాత పైలాన్‌ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, ఏపీ మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ యూనివర్సిటీ ఏపీని దేశంలోనే వ్యవసాయంలో నంబర్ వన్‌గా మార్చాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌లో ఉన్న ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణకు వెళ్ళిపోవటంతో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసింది. రంగా పేరుతోనే ఏర్పాటయ్యే ఈ విశ్వవిద్యాలయానికి కేంద్రప్రభుత్వం రు.200 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 910 ఎకరాలను కేటాయించింది.