హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి గౌతంరెడ్డి పేరు మీద వ్యవసాయ వర్శిటీ పెట్టాలని వారి తండ్రి సీఎం జగన్ను కోరారు. ఇందు కోసం ఉదయగిరిలో గౌతంరెడ్డి అంత్యక్రియలు జరిగిన ఇంజినీరింగ్ కాలేజీని ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ఆయన ఆఫర్ ఇచ్చారు. దాదాపుగా వంద ఎకరాల స్థలంలో ఉన్న ఆ ఇంజినీరింగ్ కాలేజీ విలువ రూ. 225 కోట్లు ఉంటుందని మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తామని ఆయనచెప్పారు. దానికి సీఎంజగన్ అంగీకరించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మెరిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో పరిమితంగా విద్యార్థులు చేరుతున్నారు. మెట్ట ప్రాంతం కావడంతో ఎక్కువ మంది వలస పోతున్నారు. విద్యార్థులు కూడా పేరున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ క్రమంలో గౌతంరెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా ఈ కాలేజీని ఇచ్చేయాలని మేకపాటి కుటుంబం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వ్యవసాయ విశ్వ విద్యాలయంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అమరావతిలో ఉన్న వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని ఉదయగిరికి మారుస్తారా లేకపోతే కొత్తగా పెడతారా అన్నది క్లారిటీ రావాల్సిఉంది . అది అసెంబ్లీలో పెట్టే బిల్లుతో తేలే అవకాశం ఉంది.