వ్యవసాయ చట్టాలు పార్లమెంట్లో ఆమోదం పొంది ఇక ఇంప్లిమెంట్ చేయడమే తరువాయి అన్న సమయంలో రైతులు భగ్గుమన్నారు. ఇప్పుడు అగ్నిపథ్ విషయమూ అంతే. నోటిఫికేషన్ వచ్చేస్తోందన్న సమయంలో ఆర్మీ ఆశావహులంతా రోడ్డెక్కారు. ఎందుకిలా జరుగుతోంది ? అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలంటే లెక్కలేని తనం అనే అనుకోవాలి. కేంద్రం తీరు వల్లే ఇలాంటి పరిస్థితి వస్తోంది. ప్రజలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుని బలవంతంగా అమలు చేసే ప్రయత్నాల వల్లే ఈ సమస్య వస్తోంది.
ప్రజల్లో చర్చ లేకుండానే అమల్లోకి సాగు చట్టాలు !
వ్యవసాయ చట్టాలను ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్లో ఆమోదించారు. ఈ కారణంగా ప్రజల్లో చర్చ జరిగింది. ముఖ్యంగా రైతుల్లో చర్చ జరిగింది. వ్యవసాయ చట్టాల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యేది ఉత్తరాది రైతులు కాబట్టి వారు ఆ చట్టం తమ కోసం కాదని తమను అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకేనన్న ఓ నమ్మకానికి వచ్చారు. వెంటనే వారిలో తిరుగుబాటు ప్రారంభమయింది. నిజానికి ఆ చట్టాలు రైతులు ఎంతో మేలు అని కేంద్రం చెబుతోంది.అలాంటి మేలు చేయాలనుకున్నప్పుడు రైతులకు ఎందుకు విడమర్చి చెప్పలేదు ? బలం ఉందని ఇష్టారాజ్యంగా ఆమోదించేసి అమలు చేయాలని ప్రయత్నించడం ఎందుకు? ఇలా చేయడం వల్లే ఆ చట్టాలపై వ్యతిరేకత వచ్చింది.
అగ్నిపథ్ స్కీంపైనా అదే పరిస్థితి !
ఇప్పుడు అగ్నిపథ్ విషయంలోనూ అదే పరిస్థితి. చాలా కాలం నుంచి ఈపథకంపై చర్చ జరుగుతోందని కేంద్రం చెబుతోంది. కానీ దీన్ని అమలు చేస్తామని ఆ దిశగా ఆర్మీ ఆశావహులకు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. కరోనా కారణంగా రిక్రూట్మెంట్లను గత మూడేళ్లుగా నిలిపివేశారు. ఆర్మీ లక్ష్యంతో మూడేళ్లుగా శ్రమిస్తున్న వారు నాలుగేళ్లు మాత్రమే ఉద్యోగం ఉంటుందని తెలిస్తే ఆగ్రహానికి గురి కారా ? రిక్రూట్మెంట్ కొనసాగిస్తూ… ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే సంస్కరణగానే భావించే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ అసలు చర్చ జరగకుండా హఠాత్తుగా ఇంప్లిమెంట్ చేశారు. దీంతో ఈ పతకంపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి., సైన్యం బలహీనమవుతోందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే అయినా ప్రజల్ని పట్టించుకోకపోతే ఇలాంటి పరిస్థితులే !
ప్రభుత్వాలు ప్రజల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి ప్రయత్నించడం వల్లే సమస్యలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యలు ప్రభుత్వాలను ప్రజలే ఎన్నుకుంటారు. అంత మాత్రాన వారు తీసుకునే నిర్ణయాలన్నింటికీ ప్రజామోదం ఉటుందనుకోవడం పొరపాటు. అలాగే వారికి తెలియకుండా చేసేయాలనుకోవడం కూడా పొరపాటే. అలాంటి పరిస్థితుల కారణంగానే ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. కేంద్రమే కాదు చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి ప్రజల్ని పరిగణనలోకి తీసుకోని పాలనే కారణం.